కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచాల్సిందే

TEJA NEWS

కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచాల్సిందే

** కేంద్ర పాలకుల గుండెల్లో వణుకు పుట్టించాలి

** ఫిబ్రవరి 12న జాతీయ సమ్మెపై రౌండ్ టేబుల్ మీట్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ / ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు వెంటనే జీతాలు పెంచాలని వివిధ కార్మిక సంఘాలు డిమాండ్ చేసాయి. శ్రమ దోపిడీ చేయాలనుకున్న పెట్టుబడిదారులకు మేలు చేకూర్చేల 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్లను కేంద్రం తీసుకువస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక సంఘాలు చేసే సమ్మె జయప్రదానికి కధం తొక్కాలని, పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు.


సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నారాయణపురం లోని ఐఎఫ్టియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి ఎన్.డి. రవి, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు అత్యంత ప్రమాదకరమైనవని వివరించారు. కార్మికులు లేబర్ కోడ్లు, న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందే హక్కును ఇవి నిరాకరిస్తాయన్నారు. కనీస వేతనాలను ఇకపై కేంద్రమే నిర్ణయిస్తుందని, లేబర్ కోడ్లలో ఎక్స్ గ్రేషియాకు స్థానం లేదని, కంపెనీల బ్యాలెన్స్ షీట్ అడిగే హక్కు కార్మిక సంఘాలకు, కార్మికులకు లేకుండా పోతుందని చెప్పారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ వంటి కార్మికుల హక్కులు నిర్ధాక్షిణ్యంగా కాలరాచివేయబడతాయన్నారు. లేబర్ కోడ్ల అమలుకు ఆదేశాలు జారీ చేసిన కేంద్రం తీరుపై కార్మిక వర్గం తిరగబాటు చేయడంతో అభిప్రాయ సేకరణ పేరుతో 45 రోజుల గడువు పెట్టిందన్నారు. అయితే కార్మిక సంఘాలతో ఈ కోడ్ల గురించి కేంద్రం చర్చలు కూడా జరపలేదన్నారు.

కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చడమే లక్ష్యంగా లేబర్ కోర్టులు రూపొందించ బడ్డాయన్నారు. అప్రెంటీసులు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్, కాంట్రాక్ట్ కార్మికులు, స్కీం వర్కర్లు వంటి వారికి పర్మినెంట్ కార్మికులనే విభాగమే ఇకపై ఉండదన్నారు. అసంఘటిత రంగ కార్మిక చట్టాలైన అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ చట్టం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం వంటి ప్రత్యేక చట్టాలతో పాటు ట్రాన్స్పోర్ట్ మోటారు వర్కర్స్ చట్టం వంటివి రద్దు అవుతాయన్నారు. ఈ కోడ్లను అమలుచేయడానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గుడ్డిగా సిద్దపడటం దారుణ మన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దుకు కార్మిక వర్గం చైతన్యవంతమైన పోరాటం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందన్నారు. పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.


ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐకెఎంఎస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరత్నం, ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షురాలు జి.భారతి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జి.బాల సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, నగర ప్రధాన కార్యదర్శి మాధవ్, జిల్లా నాయకురాలు బుజ్జి, ఏఐటీయూసీ నాయకులు శివ, బాల, అంగన్వాడీ నాయకురాళ్లు శోభ, జయంతి, శాంతి, సుజాత, రమణమ్మ, ఎపి ఆశ వర్కర్స్ ఫెడరేషన్ నాయకురాళ్లు లక్ష్మీకళ, శాంతి ప్రియ, ఆయేషా బాను, కవిత, రేఖ, లక్షీదేవి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top