శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు మెరుగైన వసతులు – సీవీ రెడ్డి చారిటీస్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు

TEJA NEWS

శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు మెరుగైన వసతులు – సీవీ రెడ్డి చారిటీస్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు

​విజయవాడ,
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శనానికి వచ్చే భక్తులకు సురక్షితమైన తాగునీరు, మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యతని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ వి.కె. శీనా నాయక్ స్పష్టం చేశారు.
​శనివారం ఉదయం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని సి.వి. రెడ్డి చారిటీస్ ప్రాంగణాన్ని వారు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు భక్తుల సౌకర్యార్థం చేపట్టబోయే పలు అభివృద్ధి పనులను వెల్లడించారు.

​ భక్తుల ఆరోగ్య రక్షణ కోసం సీవీ రెడ్డి చారిటీస్ ప్రాంగణంలో అత్యాధునిక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి, వాటర్ బాటిల్స్ కొండమీదకు వచ్చే భక్తులకు ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని, దీనిపై దేవాదాయ శాఖ కమీషనర్ వారి అనుమతితో ముందుకు వెళతామని, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో చర్చించి, ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఈ ప్రాంగణాన్ని భక్తులకు పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశంపై ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బందితో కూడిన ఒక సమన్వయ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ భక్తుల అవసరాలను అధ్యయనం చేసి తగు సూచనలు అందిస్తుంది.

ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉన్న హాల్స్‌లో భక్తులకు ఉచిత వసతి కల్పిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వసతులను మరింత ఆధునీకరించి, భక్తులు హాయిగా విశ్రాంతి తీసుకునేలా చర్యలు తీసుకోనున్నారు.

​ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ బడేటి ధర్మారావు, శ్రీ అవ్వారు శ్రీనివాసరావు, శ్రీమతి గూడపాటి సరోజినీ దేవి పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వెలగపూడి శంకరబాబు, ఆలయ సహాయ కమిషనర్ సి.హెచ్. రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. రాంబాబు మరియు ఇతర ఆలయ అధికారులు ఈ పర్యటనలో భాగస్వాములయ్యారు.

దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులు రైల్వే స్టేషన్‌లో దిగగానే వారికి తక్కువ దూరంలోనే మెరుగైన వసతి, స్వచ్ఛమైన నీరు అందించడం ద్వారా అమ్మవారి దర్శనం మరింత సులభతరం అవుతుందని చైర్మన్, ఈవో ఆశాభావం వ్యక్తం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top