అమరజీవి, విద్యా ప్రదాత శ్రీ చుండూరు వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయం
- ఘనంగా 45వ సంస్మరణ సభ – విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, మహిళలకు వస్త్ర వితరణ
ధర్మదాత, విద్యా ప్రధాత, అపర కర్ణుడు శ్రీ చుండూరు వెంకట రెడ్డి (సి.వి. రెడ్డి) గారి 45వ సంస్మరణ సభ శనివారం విజయవాడలోని సి.వి. రెడ్డి చారిటీస్ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అధ్యక్షత వహించగా, ఆలయ ఈవో శ్రీ శీనా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో శాస్త్రోక్తంగా దేవస్థానం అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం సి.వి. రెడ్డి గారి విగ్రహానికి చైర్మన్, ఈవో, ధర్మకర్తల మండలి సభ్యులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రసంగిస్తూ “మనిషి మరణించినా ఆయన చేసే ధర్మం బ్రతికే ఉంటుంది” అనడానికి చుండూరు వెంకట రెడ్డి గారు ఒక నిలువెత్తు నిదర్శనం. ఆయన ఒక వ్యక్తి కాదు, విజయవాడ గడ్డపై మొలిచిన ఒక ‘సేవా వృక్షం’ అని అన్నారు.సి.వి. రెడ్డి విజయవాడ నగరానికి చేసిన సామాజిక సేవలను చైర్మన్ కొనియాడారు.
ఆలయ ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ సి.వి. రెడ్డి గారి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన తన సంపాదనను తన కుటుంబం కోసం దాచుకోకుండా, సమాజం కోసం ‘ట్రస్ట్’ రూపంలో ధారపోశారు. స్వార్థం లేని సేవ చేయడం వల్లే, ఆయన మరణించి 45 ఏళ్లు దాటినా, నేటికీ ప్రభుత్వం, దేవస్థానం ఆయనకు అధికారికంగా సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారని, సివి రెడ్డి గారి వలే విద్యార్థులు ఎదిగి దాన గుణం అలవర్చుకొని సమాజానికి మేలు చేయాలని అన్నారు.
ఆలయ ప్రజాసంబంధాల అధికారి, సహాయకార్యనిర్వాహణాధికారి డాక్టర్ కె. గంగాధర్ మాట్లాడుతూ విజయవాడతో పాటు వివిధ ప్రాంతాలలో ఎన్నో విద్యా సంస్థలను, సత్రాలను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు, నిరుపేదలకు అండగా నిలిచిన సివి రెడ్డి గారి ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని,ఆ రోజుల్లోనే చదువు విలువను గుర్తించిన మహానుభావుడు అయిన సివిరెడ్డి గారు “డబ్బు లేక ఏ బిడ్డ చదువు ఆగకూడదు” అనే సంకల్పంతో వేలాది మంది పేద విద్యార్థులకు ఆయన ఆర్థికంగా అండగా నిలిచారని పేర్కొన్నారు.
ధర్మకర్తలమండలి సభ్యుడు బి. ధర్మారావు మాట్లాడుతూ
విజయవాడ నగరానికి విద్య కోసం, కనకదుర్గమ్మ దర్శనం కోసం వచ్చే పేదలకు వసతి పెద్ద సమస్యగా ఉండే రోజుల్లో ఆ సమస్యను తీర్చడానికి ఆయన నగరంలోని కీలక ప్రాంతాల్లో సత్రాలు, ధర్మశాలలు నిర్మించారని అన్నారు.
ఎస్ ఎస్ ఆర్ &సివి ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి, దేవస్థానం పూర్వ ధర్మకర్త జి. పద్మ శేఖర్ మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి సివి రెడ్డి గారు కృషి చేశారని,
మహిళల గౌరవాన్ని కాపాడటం, వారికి వస్త్ర దానం చేయడం వంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో స్త్రీల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.
ఈ సందర్బంగా సంస్మరణ సభను పురస్కరించుకుని చుండూరు వెంకట రెడ్డి గారి సేవా దృక్పథాన్ని కొనసాగిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థి వేతనాలు: వేద పాఠశాల విద్యార్థులకు మరియు నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉన్నత చదువుల నిమిత్తం ఉపకార వేతనాలను చైర్మన్, ఈవో (Scholarships) అందజేశారు.
వస్త్ర వితరణ: పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు.
అన్నప్రసాదం: కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులకు, అతిథులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ బడేటి ధర్మారావు, శ్రీ అవ్వారు శ్రీనివాసరావు, శ్రీమతి గూడపాటి సరోజినీ దేవి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వెలగపూడి శంకరబాబు, ఆలయ సహాయ కమీషనర్ సి హెచ్ రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. రాంబాబు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ శ్రీమతి పి. సుధారాణి, శ్రీ పి. చంద్రశేఖర్, శ్రీ ఎన్. రమేష్ బాబు, ఎం. తిరుమలేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
