క్యాన్సర్ ఇమ్యునోథెరపీపై క్లారిటీ ఇవ్వాలి
** లోక్‌సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న
తిరుపతి / దిల్లీ: దేశంలో రోజురోజుకీ క్యాన్సర్ మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ వినియోగంపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంట్లో కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు. ప్రభుత్వ ఆమోదిత వైద్య మార్గదర్శకాల ప్రకారం ఇమ్యునోథెరపీకి అనుమతి ఉందా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉందా, అలాగే దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్, రోగుల అర్హత ప్రమాణాలు, పర్యవేక్షణ వ్యవస్థల వివరాలు ఏమిటి అనే అంశాలపై ఆయన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స, పాలియేటివ్ కేర్‌కు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్, నిపుణుల అధ్యయనాలు మరియు అంతర్జాతీయ ప్రమాణాలను ఆధారంగా చేసుకుని జాతీయ స్థాయి మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ మార్గదర్శకాలు క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స, ఉపశమన సంరక్షణకు ప్రామాణికమైన, శాస్త్రీయ విధానాన్ని నిర్దేశిస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా చికిత్సలో ఏకరీతిని తీసుకురావడం, నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యమని వెల్లడించారు. మొత్తం 15 సిఫారసులతో రూపొందించిన ఈ మార్గదర్శకాలలో అనుకూల రోగులలో కీమోథెరపీ మాత్రమే ఇవ్వడం కంటే ఇమ్యునోథెరపీని మాత్రమే లేదా ఇతర ఔషధాలతో కలిపి ఇవ్వడం మెరుగైన ఫలితాలను ఇస్తుందని సూచించినట్లు మంత్రి తెలిపారు.
అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ పొందిన వైద్య నిపుణులు, ఆమోదిత ఔషధాలు అందుబాటులో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తృతీయ శ్రేణి ఆసుపత్రుల్లో ఇమ్యునోథెరపీ సేవలు అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. రోగుల అర్హత ప్రమాణాలు, చికిత్స విధానాలు, దుష్ప్రభావాల పర్యవేక్షణ విధానం ఫలితాల సమీక్షకు సంబంధించిన విధివిధానాలు జాతీయ స్థాయి ఊపిరితిత్తుల క్యాన్సర్ సాక్ష్యాధార మార్గదర్శకాలలో స్పష్టంగా పొందుపరచినట్లు వెల్లడించారు. లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ గురుమూర్తి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఆధునిక వైద్య పద్ధతులు సామాన్యులకు అందుబాటులోకి రావాలని, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
