కల్పవృక్ష వాహనంపై కపిలేశ్వరస్వామి
** తిలకించి తరించిన భక్తజనం
తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం ఉదయం 7 గంటలకు స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుంచి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
