సత్వర అనుమతులతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
- పారిశ్రామిక సమగ్రాభివృద్ధిలో జిల్లాను ఆదర్శంగా నిలుపుదాం
- ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త దిశగా వడివడిగా అడుగులేద్దాం
- తాజాగా 21 క్లెయిమ్‌లకు రూ. 1.66 కోట్ల ప్రోత్సాహకాలకు ఆమోదం
- డీఐఈపీసీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతులు జారీచేస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులేద్దామని.. పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాను ఆదర్శవంతంగా నిలబెడదామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గుంటుపల్లిలోని రైజ్ కేంద్రంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. పారిశ్రామిక అనుమతులు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తదితరాలతో పాటు వివిధ పారిశ్రామిక చేయూత పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి విశేష కృషిచేస్తోందని.. ఆ వేగాన్ని సమన్వయ శాఖల అధికారులు అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో పెట్టుబడిదారులకు అవసరమైన సహాయసహకారాలను అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర సాకారానికి పారిశ్రామిక అభివృద్ధి కీలకమని.. జిల్లాలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులతో ఎంఎంస్ఎంఈ పార్కుల అభివృద్దిపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.
వివిధ అనుమతులకు సంబంధించి సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వస్తున్న దరఖాస్తులను నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా వివిధ పారిశ్రామిక అభివృద్ధి విధానాల కింద 21 క్లెయిమ్‌లకు రూ. 1.66 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలకు తాజాగా కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అత్యుత్తమ వాతావరణం రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఉందన్నారు. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ పథకాల అమల్లో పురోగతిని కమిటీలో చర్చించి.. దరఖాస్తులను త్వరిగతిన పరిష్కరించేందుకు, యూనిట్ల ప్రారంభానికి కలెక్టర్ లక్ష్మీశ దిశానిర్దేశం చేశారు. మహిళలను ప్రోత్సహించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా ప్రభుత్వం చేయూతనిస్తోందని, ఆర్థిక సాధికారతకు భరోసా కల్పిస్తుందనే నమ్మకాన్ని కల్పించేందుకు రైజ్ కేంద్రంలో ఈసారి డీఐఈపీసీ సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
సమావేశంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, వాసిరెడ్డి మురళీకృష్ణ (ఫ్యాప్సియా), కనకదుర్గ (అలెప్), ఎం.సుదర్శన్ (డీఐఏ), రాజకుమారి (డిక్కీ), ఎల్డీఎం కె.ప్రియాంక, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
