భగవంతుడితో ఆటలు… వైసీపీ పతనానికి బాటలు : ప్రత్తిపాటి
- పెద్దల సభలో వైసీపీ సభ్యుల వ్యవహారశైలి… ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ : ప్రత్తిపాటి
- ప్రజాస్వామ్యమనే పచ్చని పైరుకు పట్టిన చీడపురుగు వైసీపీ : ప్రత్తిపాటి.
“ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పడుతూ… అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న జగన్, ప్రజాసమస్యలపై పోరాటానికి అవకాశం ఉన్న శాసనమండలిని కూడా తన చౌకబారు, దిగజారుడు రాజకీయాలకు వేదికగా మారుస్తున్నాడు. నేడు మండలిలో వైసీపీ సభ్యుల ప్రవర్తన, వ్యవహారశైలి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగులుతుంది. చేసిన మహాపాపాలను కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా భగవంతుడితో ఆటలు ఆడే దుస్థితికి దిగజారిన వైసీపీ… తన పతనానికి తానే బాటలు వేసుకుంటోంది.. అధికారంలో ఉన్నప్పుడు చట్టసభలను బూతులు.. అసభ్యతకు…అశ్లీలతకు వేదికగా మార్చిన వైసీపీ.. నేడు కూడా అదే పంథాను అనుసరించడం దురదృష్టకరం. ప్రజలు 11 సీట్లతో సత్కరించినా జగన్ అహాంకారధోరణి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పెడధోరణి మారలేదు. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్టు జగన్ తన దురుద్దేశాలు, దుర్మార్గాలను కూటమిప్రభుత్వంపై నెట్టే ప్రయత్నాలు చేస్తూ, ప్రజలతో ఛీ కొట్టించుకుంటున్నాడు. ప్రెస్ మీట్ల పేరిట అనుకూల మీడియా ముందు గంటలు…గంటలు అబద్ధాలు, అసత్యాలు చెప్పడం.. వాటిని ఏదో ఒకరూపంలో ప్రజల్లోకి వెళ్లేలా చేయాలనే కుట్రపూరిత ఆలోచనలతో తన పార్టీసభ్యులతో చట్టసభల్లో వెర్రిమొర్రి వేషాలు వేయించడం జగన్ కు అలవాటుగా మారింది.
ప్రజాస్వామ్యమనే పచ్చని చెట్టుకు పట్టిన చీడపురుగు వైసీపీ
బడ్జెట్ పై అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేని పార్టీ అధినేత… పెద్దల సభలో దేవుడిని అవమానిస్తూ వైసీపీ సభ్యుల పిల్లచేష్టలు చూశాక, ఆ పార్టీ ప్రజాస్వామ్యమనే పచ్చని పైరుకు పట్టిన చీడపురుగనే చెప్పాలి. ప్రజలకు తనకిచ్చిన 11 స్థానాల ఓటమి తాలూకా నిరుత్సాహాం, నిర్వేదాన్ని కప్పిపుచ్చుకోవడానికే జగన్ చంద్రబాబు, పవన్, లోకశ్ లపై నేలబారు విమర్శలు చేస్తున్నాడు. ప్రభుత్వ నిర్ణయాలు.. పాలనాంశాల కంటే తన అబద్ధాలు. అసత్యాలు, ప్రభుత్వం, ప్రధాన నాయకులపై చేసే విమర్శలే జనంలో నానాలన్న లక్ష్యంతోనే జగన్ ప్రెస్ మీట్ల పేరుతో నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు.
అసెంబ్లీలో తాను చెప్పేదే ప్రభుత్వం వినాలంటాడు.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానంటాడు.. .. మీడియా సమావేశాల్లో కూడా తాను మాట్లాడేదే విలేకరులు వినాలంటాడు.. ప్రశ్నించేవారిని దూరం పెడతాడు.. . తనకే అందరూ సమాధానం చెప్పాలి..తానెవరికీ చెప్పనంటాడు…. ప్రజాస్వామ్యంలో ఇదేం వైఖరో జగనే సమాధానం చెప్పాలి.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి శుక్రవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
