హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (HDPT) ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో (మహా మండపం 6 వ అంతస్తు) కృష్ణ, జిల్లా, గుంటూరు, బాపట్ల , పల్నాడు , ఎన్టీఆర్ జిల్లాల HDPT కోఆర్డినేటర్లు, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారులు మరియు అర్చకుల సమాఖ్య వారితో సమావేశం జరిగినది.
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ HDPT ఆధ్వర్యంలో రానున్న ఉగాది పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కనీసం దీపం కూడా నోచుకోని అనేక దేవాలయాలు ఉన్నాయని, వీటన్నిటిని గుర్తించి త్వరలోనే ఒక మంచి రోజున అన్ని దేవాలయాల్లో HDPT ఆధ్వర్యంలో ప్రతిరోజు దీపం వెలిగించే పవిత్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. రానున్న గోదావరి, కృష్ణ పుష్కరాలను పురస్కరించుకొని ఇప్పటినుండే రాష్ట్రంలోని పవిత్ర పుణ్య నదులైన కృష్ణ, గోదావరి నదుల వెంట దేవతా వృక్షాలను నాటించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి నాందిగా మొదట మార్చి ఏడవ తేదీన కంచి పీఠాధిపతి వారి మరియు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కృష్ణా నది ప్రకాశం బ్యారేజీ నుండి హంసలదీవి వరకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక దేవాలయాలను, అర్చకులను, HDPT కోఆర్డినేటర్లు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాప్రతినిధులు, ధార్మిక పరిషత్తు, భజన సంఘాల వారిని భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు.
అతిథిగా పాల్గొన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వికె శీనా నాయక్ మాట్లాడుతూ HDPT చేపట్టబోయే అన్ని కార్యక్రమాలకు దేవస్థానం తరపున పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. దేవస్థానం తరపున హిందూ ప్రచార రథం కూడా ఉందని దాన్ని ఎవరైనా కావాలన్నా పంపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేవస్థానం స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణలో అర్చకులు పాత్ర కీలకమని ఉద్బోధించారు.
రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ హిందూ మతం , బ్రాహ్మణ సంఘం ఒక్కటేనని, ఐక్యంగా అందరూ కలిసి హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగపూడి గోపాలకృష్ణ మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా HDPT చేసే కార్యక్రమాలకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ స్టేట్ కోఆర్డినేటర్ కొండలరావు మాట్లాడుతూ హిందూ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కార్యక్రమాలను రూపొందించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో సమావేశాలు జరిపి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి పాల్గొన్న కార్య నిర్వహణ అధికారులు HDPT కోఆర్డినేటర్లు మాట్లాడుతూ గతంలో దేవాలయాల దర్శనాల కోసం ప్రవేశపెట్టిన దివ్యదర్శనం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న దేవాలయాలకు ధూప దీప నైవేద్యం కింద ఇచ్చే నిధులను పెంచాలని, వేదం నేర్చుకునే చిన్నపిల్లలకు HDPT ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించాలని, వివిధ ప్రాంతాల్లో ఉన్న భజన సంఘాలను ప్రోత్సహించాలని కోరారు.
