గుంటూరు పశ్చిమలో బీసీ భవన నిర్మాణం త్వరితగతిన ప్రారంభించాలి

TEJA NEWS

గుంటూరు పశ్చిమలో బీసీ భవన నిర్మాణం త్వరితగతిన ప్రారంభించాలి – అసెంబ్లీలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి

అమరావతి, వెలగపూడి అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో “బీసీ సంక్షేమం” పై జరిగిన చర్చలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్న నేపథ్యంలో, గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన బీసీ భవన నిర్మాణాన్ని ఈ బడ్జెట్‌లోనే వేగవంతంగా ప్రారంభించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు.

ఏ దేశ ప్రగతైనా ఆ దేశంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్న గళ్ళా మాధవి, బీసీ సంక్షేమానికి కేటాయించిన ₹51,021 కోట్ల నిధులు కేవలం సంఖ్యలు కాదని, అవి బీసీల ఆత్మగౌరవ పత్రంగా భావించవచ్చని అన్నారు. 2025–26 సంవత్సర కేటాయింపుతో పోలిస్తే ఈసారి భారీ పెరుగుదల చూపడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.
బీసీల ఆర్థిక, సామాజిక పురోగతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, ఆదరణ 3.0 కింద ₹1000 కోట్లు, ఉచిత విద్యుత్ కోసం ₹600 కోట్లు, బీసీ వసతి గృహాల పురోగతికి దాదాపు ₹300 కోట్లు, ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ పథకం కింద ₹3838 కోట్ల కేటాయింపులు చేయడం అభినందనీయమని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల అభివృద్ధిని ఎప్పటికీ ప్రాధాన్యంగా తీసుకున్నారని, తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అన్న విశ్వాసంతో ఎన్నో పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. బీసీ భవనాలు కేవలం నిర్మాణాలు కాదని, అవి ఆయా వర్గాల ఆత్మగౌరవానికి, సామాజిక వికాసానికి ప్రతీకలని తెలిపారు.


బీసీ భవనం ద్వారా సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, పోటీ పరీక్షల కోసం శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాలు, మహిళల ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చని వివరించారు. కులవృత్తుల ఆధునీకరణకు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి, సమిష్టి నిర్ణయాల కోసం ఒక ఉమ్మడి వేదికగా బీసీ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.
అలాగే బీసీలపై జరుగుతున్న దాడులు, వివక్షలను అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా జాతీయ బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి డిమాండ్ చేశారు.
కొన్ని మండలాల్లో బీసీ వసతి గృహాలు, సంక్షేమ పాఠశాలలు లేని పరిస్థితిని ప్రస్తావిస్తూ శ్యావల్యపురం, బొల్లాపల్లి మండలాల్లో బీసీలు అధికంగా ఉన్నందున అక్కడ ఒక గురుకుల పాఠశాల, బీసీ సంక్షేమ బాలికల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top