​తాళం దాచిన చోటే దొంగకు దొరికింది !

TEJA NEWS

​తాళం దాచిన చోటే దొంగకు దొరికింది !

​జగద్గిరిగుట్టలో 14 తులాల బంగారం అపహరణ.. నిందితుడి అరెస్టు

బయటకు వెళ్తూ ఇంటి తాళం చెవిని దాచిన చోటే దొంగకు దొరకడంతో.. పని సులువైందనుకున్నాడో దొంగ. అదను చూసి ఇంట్లోకి ప్రవేశించి 14 తులాల బంగారు ఆభరణాలను దోచి ఉడాయించాడు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో వెలుగుచూసింది. జగద్గిరిగుట్ట డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీకి చెందిన రేకపల్లి లక్ష్మి (63) ఈ నెల 23న సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటికి తాళం వేశారు. ఆ తాళం చెవిని తలుపు పక్కనే ఉన్న డ్రమ్ కింద దాచి బయటకు వెళ్లారు. అయితే ఆమె తాళం దాస్తున్న విషయాన్ని అదే కాలనీకి చెందిన పత్రో శంకర్ (36) గమనించాడు. ఆమె వెళ్లగానే నిందితుడు డ్రమ్ కింద ఉన్న తాళంతో తలుపులు తీసి లోపలికి ప్రవేశించాడు. టీవీ టేబుల్‌పైనే ఉన్న అల్మారా తాళం చెవులతో లాకర్‌ను తెరిచి అందులోని సుమారు 14 తులాల బంగారు నగలను దొంగిలించి పరారయ్యాడు.

​పోలీసుల వేట.. నిందితుడి అరెస్టు

అదే రోజు (ఈ నెల 23న) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న లక్ష్మి దంపతులు, అల్మారా తెరిచి ఉండటం చూసి ఆందోళన చెందారు. నగలు పోయినట్లు గుర్తించి వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు, సాంకేతిక ఆధారాల లతో నిందితుడు పత్రో శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు దొంగతనం విషయమై అంగీకరించాడు. అతని వద్ద నుంచి ఒక బంగారు హారం, నల్లపూసల గొలుసు, మూడు పొరల గొలుసు, లాకెట్ ఉన్న గొలుసు, నాలుగు ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల సూచనలు..

తాళం చెవులను డోర్ మ్యాట్ల కింద, షూ రాక్‌లలో, కిటికీల సందుల్లో లేదా డ్రమ్ముల వెనుక దాచవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

-సైబరాబాద్ పీఆర్వో

You cannot copy content of this page

Scroll to Top