సైబరాబాద్ లో ప్రజా పోలీసింగ్..
ఇంటర్ పరీక్షలకు సైబరాబాద్ పోలీసుల పటిష్ట బందోబస్తు
-ప్రత్యేక పోలీస్ బృందాలతో విద్యార్థులకు సహకారం
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్షల నిర్వహణకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమైన సాయం అందిస్తున్నారు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ సిబ్బందిని నియమించి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు లేదా తప్పుడు అడ్రస్‌తో వేరే కేంద్రానికి చేరుకున్న వారిని వెంటనే గుర్తించి, పోలీస్ వాహనాల ద్వారా సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేర్చారు. ఇప్పటివరకు దాదాపు నలుగురు విద్యార్థులను సైబరాబాద్ పోలీసులు సరైన పరీక్షా కేంద్రాలకు చేర్చారు.
పరీక్షల బందోబస్తును పరిశీలించేందుకు కుత్బుల్లాపూర్ ఏసీపీ బాల గంగిరెడ్డి కేంద్రాలను సందర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతతో పాటు సహాయక చర్యలు కొనసాగించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇంటర్ పరీక్షల సందర్భంగా పేట్‌బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయ్ వర్ధన్ బందోబస్తు సిబ్బందిని సమీక్షించి, పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల తక్షణ సాయానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు
