కోవూరు పంచాయతిని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయండి
శాసనసభ సమావేశాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేసిన విజ్ఞప్తులకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించింది. రాష్ట్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం మరియు తాగునీటి సరఫరా కోసం కూటమి ప్రభుత్వం 14 వేల 539 కోట్లు కేటాయించి పట్టణాభివృద్ధికి బాటలు వేసిందని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పురపాలక శాఖ మంత్రి నారాయణ కు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో కూడా ఏపీ మున్సిపాలిటీలు ముందంజలో ఉన్నాయని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు.బుచ్చిరెడ్డి పాళెం పట్టణాన్ని గ్రేడ్-2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి బుచ్చిరెడ్డి పాళెం పురపాలక సంఘంలో నిధుల కొరతను సభ దృష్టికి తీసుకొచ్చారు.
గ్రేడ్-2 స్థాయికి తగ్గట్టుగా సిబ్బంది నియామకం, డ్రైన్లు, రోడ్ల నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించాలని ముఖ్యంగా గుడిపల్లి మరియు రేబాల కాలువల వద్ద సైడ్ రివిట్‌మెంట్ తో పాటు ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధికి తగిన నిధులు కేటాయిస్తామని సభలో హామీ ఇచ్చారు.దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న కోవూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 40 వేల పైగా జనాభా ఉన్న కోవూరుతో పాటు, భౌగోళికంగా కలిసిపోయిన పడుగుపాడు మరియు పోతిరెడ్డిపాలెం పంచాయతీలను విలీనం చేస్తే దాదాపు 75 వేల జనాభా అవుతుందని తద్వారా ఆ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు.
