కనీస విద్యా ప్రమాణాలు ప్రతి విద్యార్థికి అందించాలి…
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
పెద్దపల్లి// .కనీస విద్యా ప్రమాణాలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే ప్రతి విద్యార్థికి అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష విద్యా శాఖ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లోని ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందాలనే ఉద్దేశంతో జిల్లాలో ఉపాధ్యాయులు చేపట్టిన చర్యల వల్ల మంచి పురోగతి సాధించామని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ మరిన్ని మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
పాఠశాలల తనీఖీ నిమిత్తం విద్యా శాఖ ఉన్నతాధికారులు వీక్లీ ప్లాన్ ప్రకారం ప్రతి మండలంలో నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పాఠశాలల తనిఖీలను ప్రతి అధికారి కనీసం 80 శాతం పూర్తి చేయాలని అన్నారు. ప్రతి పాఠశాల తనిఖీ నాణ్యతతో ఉండాలని, చెక్ లిస్ట్ ప్రకారం ప్రతి అంశాన్ని పరిశీలించి, పాఠశాల పర్యటన సంబంధించి రిపోర్టు తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు.
ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు ఉండే విధంగా కృషి చేయాలని, పిల్లలు ప్రస్తుత విద్యా ప్రమాణాల స్థితిగతులను సరిగ్గా నమోదు చేయాలని అన్నారు. విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకున్నా అంతా బాగుందని చూపేట్టేందుకు తప్పుడు వివరాలు ఇవ్వవద్దని అన్నారు.
బట్టి పద్దతులలో కాకుండా పిల్లలకు విషయ పరిజ్ఞానం అందేలా పిల్లలను ఇంటరాక్ట్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరగాలని అన్నారు. గణితం ప్రమాణాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. తరగతి గదిలో ప్రతి రోజు గంట నుంచి రెండు గంటల వరకు పిల్లల రీడింగ్ స్కిల్స్, గ్రహణ శక్తి పెంచే విధంగా కార్యాచరణ చేపట్టాలని అన్నారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 7వ. తరగతి చదివే విద్యార్థులకు బేసిక్స్ దృఢంగా ఉండాలే ప్రతిరోజు గంట సమయం స్పెషల్ క్లాస్ ఏర్పాటు చేయాలని అన్నారు. 8వ. తరగతి,9వ. తరగతి విద్యార్థులపై సైతం శ్రద్ధ వహిస్తూ వారికి విషయ పరిజ్ఞానం సరిగ్గా అందేలా చూడాలని అన్నారు .
పాఠశాలలో పిల్లలకు మెరుగైన పద్దతిలో విద్యా బోధన అందించాలని, పాఠ్యాంశాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా చూడాలని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలకు నూతనంగా అందించిన కంప్యూటర్లను వినియోగించాలని, ఉన్నత తరగతి విద్యార్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ అందే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో పాత సామాన్లు, స్టోరేజ్ వస్తువులను పూర్తి స్థాయిలో తొలగించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ అధికారులు పిఎం. షేక్ మండల విద్యా ధికారులు , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు , సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
