166 సీనియర్ సిటిజన్ కేసుల పరిష్కారం…
వయో వృద్ధులు తమ ఫిర్యాదులను ముందుగా ఆర్డీఓ వద్ద నమోదు చేయాలి…
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
పెద్దపల్లి// జిల్లాలో సీనియర్ సిటిజన్ల నుండి వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలోని వయో వృద్ధుల నుండి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత రెవెన్యూ ట్రిబ్యునల్ల ద్వారా పరిశీలించి పరిష్కరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయంలో 130 కేసులు నమోదు కాగా వాటిలో 121 కేసులు పరిష్కరించగా 9 కేసులు పెండింగ్లో ఉన్నాయని, మంథని ఆర్డీఓ కార్యాలయంలో 28 కేసులు నమోదు కాగా వాటిలో 26 కేసులు పరిష్కరించగా 2 కేసులు పెండింగ్లో ఉన్నట్లు, అలాగే అప్పీలేట్ కేసులు 19 నమోదు కాగా అన్ని 19 కేసులు పూర్తిగా పరిష్కరించబడినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విధంగా జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 166 కేసులకు పరిష్కారం చూపినట్లు పేర్కొన్నారు.
సీనియర్ సిటిజన్స్ సంరక్షణ చట్టం ప్రకారం వృద్ధుల ఫిర్యాదులను ట్రిబ్యునల్లో క్షుణ్ణంగా విచారించి, తల్లిదండ్రుల పోషణ బాధ్యత పూర్తిగా వారి పిల్లలదేనని స్పష్టం చేస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పాటించని పక్షంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బుధవారం కొట్టె రాజయ్య, తండ్రి రాయమల్లు (96) ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎవరూ తనను పట్టించుకోవడం లేదని తెలియజేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.
రాజయ్య పేరుపై ఉన్న భూమిని వారికే అమ్ముకునే హక్కు ఉందని, ఆ భూమి ద్వారా వచ్చే డబ్బును రాజయ్య పేరుపై బ్యాంకులో జమ చేసి భద్రపరచాలని ఆదేశించారు. అలాగే తల్లిదండ్రుల పోషణ మరియు సంరక్షణ పూర్తి బాధ్యత కుమారులదేనని, ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే చట్టరీత్యా శిక్షలు తప్పవని కుటుంబ సభ్యులకు హెచ్చరించారు.
వయో వృద్ధులు తమ పిల్లలు సరైన విధంగా చూసుకోవడం లేదనే ఫిర్యాదులను ముందుగా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) వద్ద నమోదు చేయాలని, అక్కడ సమస్య పరిష్కారం కాని పక్షంలో జిల్లా కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. నేరుగా జిల్లా కలెక్టర్ వద్ద ఫిర్యాదు నమోదు చేయకుండా ఈ విషయాన్ని వయో వృద్ధులు గమనించాలని తెలిపారు.
