జిల్లావ్యాప్తంగా “వజ్రపహార్” తనిఖీలు

TEJA NEWS

జిల్లావ్యాప్తంగా “వజ్రపహార్” తనిఖీలు

** శభాష్ అనిపిస్తున్న తిరుపతి పోలీసు శాఖ… ఎస్పీ

తిరుపతి: “వజ్రపహార్ ఆపరేషన్‌”లో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకోసం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా “శభాష్ తిరుపతి పోలీస్ శాఖ” అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అందులో భాగంగానే “వజ్రపహార్” ఆపరేషన్ సందర్భంగా శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, నాకాబందీతో పాటు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అనుమానితులు, రౌడీషీటర్లు, గంజాయి రవాణా, సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మనగర్ ప్రాంతంలో రెనిగుంట సబ్ డివిజన్ ఎస్‌డిపిఓ నాయకత్వంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో పోలీసులు సమావేశమై గంజాయి వ్యతిరేక ప్రచారం, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. సూల్లూరుపేట సిఐ ఆధ్వర్యంలో తడ, డి.వి. సత్రం, ఓజిలి, సూల్లూరుపేట పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సిబ్బంది మన్నారపోలూరు గ్రామంలో కాసో నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 10 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సూల్లూరుపేట రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ సమీపంలోని దుకాణాలను సంబంధిత అనుమానాస్పద కార్యకలాపాల కోసం తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ఒక దొంగిలించిన మోటార్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాయుడుపేట – శ్రీకాళహస్తి రోడ్డుపై పోలీసులు విజిబుల్ పోలీసింగ్, ట్రాఫిక్ క్లియరెన్స్ విధులు నిర్వహించి వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.

తిరుమలలోనూ తనిఖీలు:

తిరుమల సబ్ డివిజన్ పరిధిలోని పాపవినాశనం ప్రాంతంలో నాకాబందీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్, ఫైర్, బీడీ టీం, హెల్త్ డిపార్ట్‌మెంట్లకు చెందిన సుమారు 60 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఇక తిరుపతి ఆటోనగర్ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి మొత్తం 32 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గంజాయి రవాణాదారులు, రౌడీషీటర్లు, అనుమానితులు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. శ్రీకాళహస్తి సబ్‌డివిజన్ పోలీసులు తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని శివనాధపాలెం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎస్‌డిపిఓ నాయకత్వంలో సబ్‌డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించి ప్రజలతో మాట్లాడి గంజాయి వాడకంతో కలిగే దుష్ప్రభావాలు గురించి అవగాహన కల్పించారు.
అలాగే గంజాయి వినియోగాన్ని నిరోధించేందుకు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి యువతను మరియు గ్రామ ప్రజలను గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు మరియు 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. అలాగే ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top