
ర్యాగింగ్ భూతానికి మరో ప్రాణం బలి కావాలా…?
నిందితులను కఠినంగా శిక్షించాలని సమతా సైనిక దళ్ డిమాండ్…
కేయూ విద్యార్థిని శ్రీవిద్య మృతిపై దిగ్భ్రాంతి…
- డా. మార్షల్ దుర్గం నగేష్….
పెద్దపల్లి// రామగుండం, : వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్న ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన విద్యార్థిని శ్రీవిద్య మృతి పట్ల, సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ర్యాగింగ్ వేధింపులే శాపమా…?
శ్రీవిద్య చనిపోయే ముందు ఆసుపత్రిలో ఇచ్చిన వాంగ్మూలం కలచివేస్తోందని డాక్టర్ నగేష్ పేర్కొన్నారు. హాస్టల్లో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్, వారి వేధింపులు, నిరాధారమైన ఆరోపణల వల్లే తను తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు వదులుకోవాల్సి వచ్చిందని చెప్పడం వర్సిటీల్లో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. “ఒక సామాన్య కుటుంబం నుంచి ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం వచ్చిన విద్యార్థినిని వేధించి చావుకు ప్రేరేపించడం అమానుషం” అని ఆయన మండిపడ్డారు.
ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి…
శ్రీవిద్య మృతికి కారణమైన వారిని వెంటనే గుర్తించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు భరోసా కల్పించాలని కోరారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, తగిన ఆర్థిక సహాయం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.