
ప్రణాళికా బద్ధంగా అభిప్రాయ సేకరణ
** తిరుమలలో భక్తులతో మాట్లాడిన సిఎం చంద్రబాబు
తిరుమల: శ్రీవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
తిరుమలలో భక్తులతో మాట్లాడారు. అంతకు ముందు శ్రీ వెంగమాంబ అన్నప్రసాదాల వితరణ కేంద్రంలో శ్రీవారి సేవకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. భక్తులతో మరింత మమేకం కావాలని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అభిప్రాయ సేకరణ ప్రణాళిక బద్ధంగా చేపట్టాలని సూచించారు.
కాన్వాయ్ నుంచి దిగిన ఆయన కొద్దిసేపు కాలినడకన తిరుగుతూ భక్తులతో ముచ్చటించారు. తిరుమలకు వచ్చిన భక్తుల అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత ఎలా ఉందని ముఖ్యమంత్రి భక్తులను అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం నాణ్యత చాలా బాగుందని భక్తులు ముఖ్యమంత్రికి తెలిపారు.
అలాగే శ్రీవారి దర్శనం వేగంగా జరిగేలా చూడాలని భక్తులు ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, త్వరలో ఏఐ టెక్నాలజీ ద్వారా శ్రీవారి దర్శనం త్వరితగతిన జరిగేలా టిటిడి చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం టిటిడి ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.