
వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందే…!
కులం పేరిట అణచివేస్తూ.. హక్కుల కాలరాస్తారా?
సమతా సైనిక దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్షల్ దుర్గం నగేష్…
పెద్దపల్లి// ఎన్టిపిసి:
దేశంలో తరతరాలుగా కొనసాగుతున్న కుల వివక్ష అంతం కానంత వరకు రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదని సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. మార్షల్ దుర్గం నగేష్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఎన్ని తరాలు ఉండాలంటూ ప్రశ్నించే మేధావులు, పాలకులు.. మరి కుల వివక్ష ఎన్ని తరాలు కొనసాగుతుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు మరియు ప్రస్తుత సామాజిక పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ విరుద్ధమైన తీర్పులు: “ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చిందే సామాజిక వివక్ష ఆధారంగా. ఆ వివక్ష నేటికీ తొలగిపోలేదు. కానీ, కొన్ని శక్తులు కావాలనే రిజర్వేషన్లపై విషం చిమ్ముతున్నాయి. జనాభాలో కేవలం 5 శాతం లోపు ఉన్న అగ్రవర్ణాల పేదలకు ( ఈ డబ్ల్యూ ఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు 50 శాతం నిబంధన గుర్తుకురాని కోర్టులకు, బీసీలకు 42 శాతం కోటా అంటే మాత్రం స్టేలు ఇస్తూ అడ్డుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?” అని నగేష్ ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని ఆయన విమర్శించారు.
మతం మారితే కులం పోతుందా?: దళిత క్రైస్తవుల అంశంపై స్పందిస్తూ.. “ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన సమాజం అతన్ని చూసే కోణం మారుతుందా..? దళితులు వేరే మతాచారాలు పాటిస్తే రిజర్వేషన్లు వర్తించవని చెప్పడం వారిని బానిసలుగా ఉంచాలనే కుట్రలో భాగమే. గుళ్లోకి రానివ్వరు, బయట గౌరవం ఇవ్వరు, పోనీ హక్కుల కోసం పోరాడితే మతం అడ్డుపెట్టి అణచివేస్తారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15కు అవమానం” అని దుయ్యబట్టారు.
కుందాలపల్లి ఘటన – పోలీసుల తీరుపై మండిపాటు: ఇటీవల కుందాలపల్లిలో జరిగిన అమానుష ఘటనను ప్రస్తావిస్తూ, శవయాత్రను అడ్డుకున్నది పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ కేవలం 10 మందిపైనే కేసులు నమోదు చేయడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. నేటికీ తాగే నీళ్ల కోసం, గౌరవప్రదమైన అంత్యక్రియల కోసం దళితులు పోరాడాల్సి రావడం దేశానికే సిగ్గుచేటన్నారు.
రాజకీయ పక్షాల మౌనం: ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా దళితుల ఆవేదనను, హక్కులను చిత్తశుద్ధితో పట్టించుకోవడం లేదని నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలకు జెండాలు మోసేది దళిత, బహుజనులేనని, కానీ అధికారం దగ్గరకు వచ్చేసరికి వారి గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా దళిత, బహుజన సమాజం మేల్కొని తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.