
సీఎం పర్యటనలో ఇబ్బందులు రానీయొద్దు
** ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశం
తిరుపతి / నాయుడుపేట: సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 30న సోమవారం ( రేపు) తిరుపతి జిల్లా నాయుడుపేట పుదూరులో టిడ్కో గృహాల ప్రారంభోత్సవం – పర్యటన ఏర్పాట్లపై రెవిన్యూ, పోలీస్ శాఖలు విస్తృత సమీక్ష చేపట్టారు. పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడులు ఆదేశించారు. నాయుడు పేట మండలం పుదూరు గ్రామంలో ఏపీ టిడ్కో గృహాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయనున్న సందర్భంగా గ్రామంలో నిర్వహించిన అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, అడిషనల్ ఎస్పీ రవి మనోహారాచారి, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశి, సూళ్లూరుపేట ఆర్డీవో దేవేంద్ర రెడ్డి తదితర అధికారులు పాల్గొని పర్యటన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. హెలిప్యాడ్, సభా వేదిక, స్టాల్స్, లబ్ధిదారులతో సమావేశం వంటి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవడంతో పాటు, అగ్నిమాపక, వైద్య సదుపాయాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమ ప్రాంగణాల్లో పారిశుద్ధ్యం, త్రాగునీరు వంటి మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. కేటాయించిన నిధులను సమయానికి వినియోగించి, ఎలాంటి ఆలస్యం లేకుండా విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. హెలిప్యాడ్ ప్రాంతం నుండి సభా వేదిక వరకు ప్రతి దశలో మందస్తు భద్రత చర్యలు చేపట్టాలని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, జనసంచారం నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా, సమయపాలనతో విధులు నిర్వహించాలని, ఎలాంటి అలసత్వానికి తావులేకుండా పని చేయాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించడం ద్వారా కార్యక్రమం విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి దొరవారి సత్రం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని, ముఖ్యమంత్రి పర్యటించనున్న వివిధ ప్రదేశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.