
ప్రపంచ స్థాయికి తిరుపతి అభివృద్దే లక్ష్యం
** భూమనా…విషం చిమ్మడం మానుకోండి
** ప్రెస్ మీట్ లో చంద్రగిరి ఎమ్మెల్యేతో “తుడ” ఛైర్మన్
తిరుపతి: తిరుపతి పుణ్యక్షేత్రంలో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న భక్తులు, ప్రజల తాకిడికి అనుగుణంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో తిరుపతిని వేగంగా అభివృద్ధి చేయడమే తమ ఏకైక లక్ష్యమని తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడ) చైర్మన్ కమ్ టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో డాలర్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ… తిరుపతి అభివృద్ధికి భూముల కేటాయింపుపై మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం, ముఖ్యంగా తిరుపతి ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. అందుకోసం ముఖ్యమంత్రి ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా రాష్ట్రాభివృద్ధి కోసం, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
అలాగే మంత్రి
నారా లోకేష్ కూడా రాష్ట్ర అభివృద్ధి – నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా విదేశీ పర్యటనలు చేస్తూ కంపెనీలను రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి హోటల్స్ నిర్మాణానికి కేటాయించిన భూముల ధరలపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. 21 ఎకరాల భూమిని రూ.1400 కోట్లకు అమ్మారనడం హాస్యాస్పదం అన్నారు. తిరుపతిలో ప్రస్తుతం ప్రైవేట్ భూముల ధరలే ఎకరాకు సుమారు రూ.250 కోట్లు పలుకుతున్నాయి. అటువంటప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరుగుతున్న అభివృద్ధిని విమర్శించడం సరికాదని సూచించారు.
తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ప్రస్తుతం ఉన్న 800-850 స్టార్ హోటల్ గదులు ఏమాత్రం సరిపోవు కనుక భక్తుల సౌకర్యార్థం మరిన్ని అంతర్జాతీయ స్థాయి హోటల్స్ హయత్, మారియట్, నోవాటెల్ తిరుపతికి ఎంతో అవసరమని తెలిపారు, తద్వారా స్థానికంగా ఉపాధి పెరుగుతుందని వివరించారు. తిరుపతికి ప్రతిరోజూ సుమారు 1.5 లక్షల మంది భక్తులు వస్తుంటారని, వారందరికీ వసతి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసిన రోడ్ల విస్తరణ (80 అడుగుల రోడ్లు), కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం, మాస్టర్ ప్లాన్ రోడ్లను తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోందని,తిరుచానూరు పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నారా లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని, కేవలం రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని కరుణాకర్ రెడ్డిని హెచ్చరించారు. తిరుపతిని ఒక ‘రౌడీయిజం సిటీ’గా కాకుండా ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరంగా ఉంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. చివరగా, వ్యక్తిగత విమర్శలు మాని, తిరుపతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.