
కాలువలో వ్యర్థాలు వేయకుండా పళ్ళు, కూరగాయలు, మాంసం వ్యాపారులు సహకరించాలి….
-నగర మేయర్ మహంకాళి స్వామి….
పెద్దపల్లి// కాలువలో వ్యర్థాలు వేయకుండా పళ్ళు, కూరగాయలు, మాంసం వ్యాపారులు సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు.
శివాజీ నగర్ మార్కెట్ వ్యాపారస్థులతో నగర పాలక సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యాపారి గురువారం లోపు రెండు బకెట్లు (పచ్చ రంగు , నీలం రంగు) ఏర్పాటు చేసుకొని అందులో మాత్రమే చెత్త వేయాలని అన్నారు.మునిసిపల్ వాహనాల ద్వారా బకెట్ లలో చెత్త తీసుకువెళ్తారని అన్నారు.
ఉదయం సందర్శనలో కాలువ పరిశీలించినప్పుడు పళ్ళు,కూరగాయలు, మాంసం వ్యర్థాలు గమనించడం జరిగిందని అన్నారు. తద్వారా వ్యాపారులతో పాటు చుట్టు ప్రక్కల కాలనీ వాసులు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. తడి చెత్తను రీ సైకిలింగ్ చేసే బయో గ్యాస్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని అన్నారు.
స్వచ్ఛ రామగుండం గా మారడానికి మార్కెట్ వ్యాపారులు చెత్త కాలువలో వేయకుండా సహకరించాలని కోరారు. ఎవరైనా చెత్త వేస్తే రూ.500/-జరిమానా విధించడం జరుగుతుందని, పునరవృతమైతే మార్కెట్ నుండి ఖాళీ చేయిస్తామని అన్నారు.
సి.సి.కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేసి జరిమానాలు విధిస్తామని, దుకాణంలో అపరిశుభ్రత లేకుండా జాగ్రత్తలు తీసుకొని మాంసం విక్రయాలు జరపాలని, వినియోగదారులకు, విక్రయదారులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఎం ఎల్ ఏ సూచనల ప్రకారం అందమైన, స్వచ్ఛమైన మార్కెట్ గా తీర్చిదిద్దాల్సిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు.
తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకున్న మాదిరిగా మార్కెట్ ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని,సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన షెడ్ ఏప్రిల్ చివరి వారం వరకు అందుబాటులోకి వస్తుందని అన్నారు.
రోడ్లు, యు జి డి ,రైతులకు రెస్ట్ రూమ్స్, మరుగు దొడ్లు తదితర వసతులు కల్పిస్తామని మార్కెట్ లో ఆర్ ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి త్రాగు నీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు.
కావున వ్యాపారస్తులు సహకరించి రెండు డబ్బాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ మేరకు మరో రెండు రోజుల్లో తనిఖీ లు నిర్వహించి డబ్బాలు షాపు ముందు లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు .
వ్యాపారస్తులు కోరిన విధంగా మార్కెట్ లో అనుచిత కార్యకలాపాలు జరగకుండా పోలీసుల సహకారంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పశువులను తరలిస్తామని హామీ ఇచ్చారు. బయట చేపలు విక్రయించిన తరువాత చెత్త అక్కడే వదిలిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని,
అద్దె బకాయిలు సక్రమo గా చెల్లించాలని అన్నారు. ఈ మేరకు తమ మార్కెట్ శుభ్రంగా ఉంచుకుంటామని వ్యాపారులు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ నాయిని వెంకట స్వామి,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి వి రామన్, టి పి ఎస్ నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ సానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ , తదితరులు పాల్గొన్నారు.