
నగర పాలక సంస్థ స్వంత వాహనాలతో కాలువల్లో పూడిక తీయిస్తూ,కోట్లాది రూపాయల నిధులు మీగులు బాటు…
రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి…
పెద్దపల్లి//గోదావరిఖని: నగర పాలక సంస్థ స్వంత వాహనాలతో కాలువల్లో పూడిక తీయిస్తూ, కాంట్రాక్ట్ పేర కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా మిగులుస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా 40వ. డివిజన్ లో స్థానిక కార్పోరేటర్ కజంపురం జయప్రద, రాజేందర్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏటా పూడిక తీత పనులకు లక్షల రూపాయల నిధులు కేటాయిస్తూ పనులు మాత్రం తూ… తూ.. మంత్రంగా చేపట్టడం ఆనవాయితీ గా వస్తున్నదని అన్నారు.
ఈ ఆనవాయితీ కి చరమ గీతం పాడుతూ డబ్బులు వృధా చేయకుండా నగర పాలక సంస్థ స్వంత వాహనాలు , మునిసిపల్ పారిశుద్ధ్య సిబ్బందితోనే, ప్రదాన కాలువల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి పూడిక తొలగించే పనులు చేపడుతున్నామని అన్నారు.
వార్డు సందర్శనలో భాగంగా తాను , స్థానిక కార్పోరేటర్ తో పాటు పాలక వర్గ సభ్యులు , అధికార యంత్రాంగం , సిబ్బంది స్పెషల్ డ్రైవ్ లో పాల్గొంటూ పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యేలా చూస్తున్నామని, ఉల్లి గడ్డల బజార్ లో ప్రవహిస్తున్న డ్రెయిన్ ఆక్రమణకు గురై భవనాలు నిర్మించడంతో పూడిక తీసే పనులకు ఆటంకం కలుగుతున్నదని, అయినప్పటికీ పట్టు విడువకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో పూడిక తీయించే పనులను చేయిస్తున్నామని అన్నారు.
పూడిక తీయించని పక్షంలో రాబోయే వర్షాకాలంలో కాలువ నిండి మురుగు నీరు ఇళ్ళల్లోకి వచ్చే అవకాశం ఉందని, డ్రెయిన్ ప్రక్కన నివసిస్తున్న వారు చెత్త కాలువల్లో పడవేయకుండా సహకరించాలని కోరారు. స్వచ్చ రామగుండం గా నగరం గుర్తింపు తెచ్చుకోవడానికి నగర పౌరులంతా ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు.
కాగా 40వ. డివిజన్ ఉల్లి గడ్డల బజార్ లో రామన్ వారధికి ఇరువైపులా ఉన్న పెద్ద మురుగునీటి కాలువలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన పూడికను పెద్ద పెద్ద యంత్రాలతో తొలగించి, ట్రాక్టర్ల ద్వారా అప్పటికప్పుడే తరలించారు. దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూనే , కాలువ ఒడ్డున ఖాళీ స్థలాల్లో చెత్త తొలగించే పనుల్లో నగర మేయర్ మహంకాళి స్వామి, పలువురు కార్పొరేటర్లు , అధికారులు కూడా శ్రమ దానం చేశారు.
ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వారందరికీ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆద్వర్యంలో అల్పాహార ఏర్పాట్లు చేశారు. రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, ఇ.ఇ. పి.వి రామన్, టి.పి ఎస్ నవీన్, డి.ఇ అఫ్తాబ్, ఎ.ఇ జమీల్ ,సానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.