…

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల్లో అర్ధాకలితో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. నెలల తరబడి జీతాలు ఆలస్యమవడంతో వారు అర్ధాకలితో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటమనుషులు, అటెండర్లు, భద్రతా సిబ్బంది, స్వీపర్లు వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, తమ కష్టానికి సరైన పారితోషికం సమయానికి అందడం లేదని వారు చెబుతున్నారు. “పిల్లల కోసం వండుతున్నాం, పాఠశాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాం… కానీ మా ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితి వచ్చింది” అంటూ ఒక ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. జీతాల చెల్లింపులో జరుగుతున్న ఈ ఆలస్యానికి సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. బిల్లులు సమయానికి పంపకపోవడం, ఫైల్స్ పెండింగ్‌లో ఉంచడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని చెబుతున్నారు. ప్రతి నెలా ఇదే పరిస్థితి పునరావృతం అవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. తక్షణమే జీతాలను సమయానికి చెల్లించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి స్థిరత్వం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
సాంఘీక సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న వేలాది మంది పేద విద్యార్థుల సేవలో నిమగ్నమై ఉన్న ఈ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. జీతాల ఆలస్యంతో వారి జీవనోపాధి సంక్షోభంలో పడుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ జీతాలను విడుదల చేయడం,నెలనెలా జీతాలు సమయానికి చెల్లించే విధానం అమలు చేయడం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస భద్రత, సంక్షేమం కల్పించడం వంటి చర్యలు తీసుకుంటేనే ఉద్యోగుల్లో నమ్మకం పెరుగుతుంది. లేకపోతే, గురుకుల వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.