స్విమ్స్” అభివృద్ధికి టీటీడీ వెనుకాడదు

TEJA NEWS

స్విమ్స్” అభివృద్ధికి టీటీడీ వెనుకాడదు

** రూ.100 కోట్లతో వైద్యయంత్రాలు ప్రారంభం

** ప్రారంభోత్సవంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాయలసీమ ప్రజలకు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు మెరుగ్గా అందిస్తున్న “స్విమ్స్” ఆస్పత్రి అభివృద్ధికి టీటీడీ ఏనాడూ వెనుకాడదని టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీఆర్) నాయుడు స్పష్టం చేశారు. తెలుగువారి ఆరాధ్య దైవమైన “అన్న” నందమూరి తారక రామారావు చేతుల మీదుగా 45ఏళ్లక్రితం తిరుపతిలో పురుడు పోసుకున్న ఈ స్విమ్స్ ఆస్పత్రి, అనుబంధ మెడికల్ కాలేజీ ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించి…. వేలాది మందికి ఉద్యోగ – ఉపాధితో పాటు లక్షలాది మందికి ప్రభుత్వం ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తోందని పేర్కొన్నారు. అందుకు తోడుగా ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)ను అభివృద్ధి చేస్తున్నామని బిఆర్ నాయుడు వెల్లడించారు. స్విమ్స్ ఆసుపత్రిలో రూ.55 కోట్లతో ఏర్పాటుచేసిన పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలరేటర్ వంటి ఆధునిక వైద్య పరికరాలను గురువారం బీఆర్ నాయుడు ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. క్యాన్సర్ వైద్య చికిత్సల కోసం శ్రీ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని పథకం నిధులతో ప్రారంభించిన. పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలరేటర్ వైద్య పరికరాలు రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో దాదాపు రూ.18కోట్ల విలువైన పెట్ సిటీ స్కాన్ పరికరం క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులను త్వరగా గుర్తించడంలో ఉపయోగపడు తుందన్నారు. రూ.5 కోట్ల విలువైన గామా కెమెరా అవయవాల పనితీరును, కణజాల స్థితిని చిత్రాల రూపంలో చూపిస్తుందని, క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు, గుండె, మెదడు, థైరాయిడ్, ఎముకలు, మూత్రపిండాల పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా, రూ.29 కోట్ల విలువైన హై ఎనర్జీ అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా అధిక శక్తి గల ఎక్స్-రేలు లేదా ఎలక్ట్రాన్ కిరణాలను క్యాన్సర్ ట్యూమర్పై ఖచ్చితంగా ప్రసారం చేస్తుందని, దీని వల్ల చుట్టుపక్కల ఆరోగ్యకర కణజాలానికి హాని తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ యంత్రం మెదడు, రొమ్ము, ప్రోస్టేట్, ఊపిరితిత్తులు వంటి భాగాల్లో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడుతుందన్నారు. స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన స్విమ్స్ విశ్వవిద్యాలయం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. 30 ఏళ్లుగా టిటిడి సహకారంతో రూ.450 కోట్లతో ఆసుపత్రిలో మెరుగైన వైద్యసౌకర్యాలు ఏర్పాటు జరిగిందని వివరించారు.

ఇప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టిటిడి చైర్మన్ బిఆర్. నాయుడు మార్గదర్శకత్వంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా రూ.600 కోట్లతో పలు భవనాలు నిర్మించుకుంటున్నామని వెల్లడిచారు. ఆరు నెలల క్రితం దాతల సహకారంతో ఎంఆర్ఐ, సిటి స్టిమ్యులేటర్ యంత్రాలు ప్రారంభించామని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో క్యాన్సర్ బ్లాకు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భవిష్యత్తులో రోబోటిక్ సర్జరీలు, వైద్య విద్యార్థులకు ఉపయోగపడేలా సిమ్యులేటర్స్, వర్చువల్ డిసెక్షన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు సదాశివరావు, పనబాక లక్ష్మి, జానకి దేవి. భానుప్రకాష్ రెడ్డి, తుడ ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, తిరుపతి మున్సిపల్ మాజీ డిప్యూటీ మేయర్ ఆర్. సి. మునికృష్ణ, స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (ఎంఆర్ఓ) శిరీష, పీఆర్వో రాజశేఖర్, పీఆర్వో కార్యాలయం సిబ్బంది అమర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, గణేష్, ఇతర స్విమ్స్ అధికారులు, రేడియేషన్ అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ విభాగం వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top