తిరుపతి రైల్వే డివిజన్ పై తాడోపేడో తేల్చేద్దాం

TEJA NEWS

తిరుపతి రైల్వే డివిజన్ పై తాడోపేడో తేల్చేద్దాం

** ఇక ఉద్యమం ఉధృతమే…

** రైల్వే “డివిజన్ సాధన సమితి” కన్వీనర్ కుప్పాల గిరిధర్

తిరుపతి: రైల్వే శాఖకు ఏడాదికి సుమారు 450 కోట్లు ఆదాయం తెచ్చిస్తున్న తిరుపతి కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటుపై ఇక సహనం లేదని…. అన్నివర్గాలు కలసి తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసిందని రైల్వే “డివిజన్ సాధన సమితి” కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన వివిధ కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులతో కలసి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. నాలుగు రైల్వే డివిజన్ల పరిధిలో తిరుపతి జిల్లా ఉండటం దారుణం అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి “బాలాజీ రైల్వే డివిజన్” ప్రకటించాలని, లేకపోతే గతంలో తిరుపతి నుండి గుంటూరుకు తరలించిన రైల్వే డివిజన్‌ను తిరిగి తిరుపతికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే రాయలసీమ వ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ హెచ్చరించారు. విశాఖకు రైల్వే జోన్ రావడం సంతోషకర పరిణామమని పేర్కొన్నారు. అయితే విశాఖ రైల్వే జోన్ పరిధిలో వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కొనసాగుతున్నప్పటికీ అన్ని అర్హతలు కలిగిన తిరుపతిని మాత్రం బాలాజీ రైల్వే డివిజన్‌గా ప్రకటించకపోవడం రాయలసీమకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అర్హతలు ఉన్న తిరుపతికి అన్యాయం జరుగుతుందని సుమారు 100 కు పైగా ఈ మార్గంగుండా రైళ్లు నడుస్తున్నాయని ఒకరోజుకు లక్ష మందికి పైగా తిరుపతి మీదుగా ప్రయాణం చేస్తున్నారు.
ప్రస్తుతం తిరుపతి జిల్లా నాలుగు వేర్వేరు రైల్వే డివిజన్ల పరిధిలో ఉండటం దేశంలోనే అరుదైన… విచిత్రమైన పరిస్థితి అని ఆయన విమర్శించారు.

విచిత్ర పరిణామం ఇదీ….

నాయుడుపేట, సూళ్లూరుపేట, పుత్తూరు ప్రాంతాలు చెన్నై డివిజన్ పరిధిలో, ఓబులవారిపల్లి – కృష్ణపట్నం లైన్ విజయవాడ డివిజన్ పరిధిలో, నడికుడి – శ్రీకాళహస్తి మార్గం గుంటూరు డివిజన్ పరిధిలో, తిరుపతి – రేణిగుంట ప్రాంతం గుంతకల్లు డివిజన్ పరిధిలో కొనసాగుతున్నాయని తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్‌కు గానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు గానీ, రైల్వే అభివృద్ధి పనులు చేపట్టాలన్నా లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమన్వయం చేయాలన్నా నలుగురు డివిజన్ల డీఆర్‌ఎంలతో మాట్లాడాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు.

రూ.450 కోట్ల ఆదాయం ఇస్తున్నా అన్యాయమే…

తిరుపతి – రేణిగుంట రైల్వే స్టేషన్లు కలిపి ఏటా సుమారు రూ.450 కోట్లకు పైగా ఆదాయాన్ని భారతీయ రైల్వేకు అందిస్తున్నాయని, లక్షలాది మంది యాత్రికులు, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఉపయోగించే ఈ ప్రాంతానికి స్వంత రైల్వే డివిజన్ లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
గుంతకల్లు డివిజన్ కార్యాలయం తిరుపతి నుండి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వీఐపీలు, భక్తులు, అత్యవసర సేవల సమన్వయంలో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 2003 సంవత్సరంలో తిరుపతిని “బాలాజీ రైల్వే డివిజన్”గా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ, రాజకీయ, పరిపాలనా కారణాల వల్ల ఆ డివిజన్ గుంటూరుకు తరలిపోయిందని గుర్తు చేశారు. ఇప్పుడయినా ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. విశాఖ జోన్ పరిధిలో ప్రస్తుతం పక్కపక్కనే ఉన్న గుంటూరు, విజయవాడ డివిజన్లలో పునర్వ్యవస్థీకరణ చేపట్టి తిరుపతికి ప్రత్యేక డివిజన్ ఇవ్వాలని సూచించారు. ఒకవేళ కొత్తగా బాలాజీ డివిజన్ ప్రకటించలేని పరిస్థితి ఉంటే, గుంటూరు డివిజన్‌ను తిరుపతికి తరలించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి పరిపాలనా మార్పులు దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరిగాయని గుర్తు చేశారు.

30రోజుల్లో నిర్ణయం లేకపోతే ఉద్యమమే

కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లో తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపార వర్గాలు, యువజన సంఘాలతో కలిసి రాయలసీమ వ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి. చౌదరి, పోస్టల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు శ్రీధర్ బాబు, వై.యస్. బాబు, బుజ్జిబాబు నాయుడు, హేమంత్, నీలాద్రి, నీలేష్, రమేష్, టీవీ రావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top