ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి….

TEJA NEWS

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి….

కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:జిల్లాలో జరుగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.

కల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం, కల్వశ్రీరాంపూర్ మండల కేంద్రం, ఓదెల మండలంలోని పోత్కపల్లి, ఓదెల మండల కేంద్రం, సుల్తానాబాద్ మండలంలోని రేగడి మధికుంట గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అలాగే సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని జై హనుమాన్ రైస్ మిల్, సాంబశివ రైస్ మిల్, పూసాల గ్రామంలోని కనకమహాలక్ష్మి రైస్ మిల్, సుగ్లంపల్లి గ్రామంలోని లక్ష్మీ భవాని రైస్ మిల్లులను తనిఖీ చేసి ధాన్యం అన్‌లోడింగ్, నిల్వ, రవాణా ప్రక్రియలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు, తేమ కొలిచే పరికరాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధం చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు.

నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడింగ్ చేసి ఆలస్యం లేకుండా కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. రైస్ మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి ట్రక్ షీట్లు వెంటనే జనరేట్ చేయాలని అధికారులకు సూచించారు.

రైతుల నుంచి ధాన్యం స్వీకరణలో ఎలాంటి కోతలు విధించకుండా పారదర్శకంగా కొనుగోలు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన చెల్లింపులు ఆలస్యం కాకుండా వారి బ్యాంకు ఖాతాల్లో సకాలంలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ తనిఖీలలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top