రోజుకు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలి….

TEJA NEWS

రోజుకు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలి….

కొనుగోళ్ల వేగం పెంచాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశం…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసి రోజుకు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, లిఫ్టింగ్, ట్యాబ్ ఎంట్రీలు, కొనుగోలు కేంద్రాల పనితీరుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. గత సీజన్‌లో రోజుకు 14 నుండి 15 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోళ్లు జరిగాయని, ప్రస్తుతం రోజుకు కేవలం 8 వేల మెట్రిక్ టన్నుల మాత్రమే కొనుగోలు జరుగుతోందని పేర్కొన్నారు. వెంటనే కొనుగోళ్ల వేగాన్ని పెంచి రోజుకు కనీసం 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ లోడింగ్ పనులను సెంటర్ ఇన్‌చార్జ్‌లు సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి కేంద్రం నుంచి రోజువారీగా ఎక్కువ సంఖ్యలో వాహనాల ద్వారా ధాన్యం లిఫ్టింగ్ జరిగేలా చూడాలని తెలిపారు. హమాలీల సమస్యను వెంటనే పరిష్కరించి అవసరమైన మేరకు సంఖ్యను పెంచాలని అధికారులకు ఆదేశించారు.

ప్రతి కేంద్రంలో ఎఫ్‌ఏక్యూ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు నిర్వహించాలని, ధాన్యం లోడింగ్ ప్రక్రియను సెంటర్ ఇన్‌చార్జ్‌లు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ట్యాబ్ ఎంట్రీలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నమోదు కావడం లేదని, ఈ పరిస్థితిని వెంటనే సరిచేసి ఈరోజే 100 శాతం ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
రెండో శనివారం, ఆదివారం రోజుల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేయాలని, కొనుగోళ్లు నిరంతరంగా కొనసాగాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు స్థానిక రైతుల ధాన్యానికే రైస్ మిల్లుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో డీసీవో శ్రీమాల, డీసీఎస్ఓ శ్రీనాథ్, అడిషనల్ డీఆర్‌డీవో రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, రైస్ మిల్ నిర్వాహకులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top