
యూనియన్ నేతలపై వేధింపులు ఆపండి
** మంగంపేట బెరైటీస్ పై సీఐటీయూ డిమాండ్
….
తిరుపతి: ఏపీఎండిసి మంగంపేట బెరైటీస్ యూనియన్ (సిఐటియు) నేత ఆర్. వెంకటేష్ పై పోలీసు వేధింపులు మానుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.జయచంద్ర, టిసుబ్రహ్మణ్యం, రైల్వే కోడూరు కార్యదర్శి చంద్రశేఖర్ లు తిరుపతి ఏఎస్పి రవి మనోహరచారికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీని సిఐటియు నేతల బృందం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీతో నేతలు మాట్లాడుతూ ఏపీఎండిసి మంగంపేట బెరైటీస్ పరిశ్రమ పరిరక్షణ కోసం…, కార్మికులను పర్మినెంట్ చేయటంపై సిఐటియు నేత వెంకటేష్ రాజీ లేకుండా గట్టిగా పోరాడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఉన్నతాధికారులకు పరిశ్రమలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేస్తున్నారని వివరించారు. దాంతో వెంకటేష్ జోక్యాన్ని, సిఐటియు పోరాటాలను సహించలేని స్థానిక అధికార పార్టీ నేతలు కొందరు పెద్దల సహకారంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి తమ నాయకుడు వెంకటేష్ పై పోలీసుల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని ఏఎస్పీకి వివరించారు.
ఏపీఎండిసికి అనుబంధంగా పలువురు జీవనోపాధి పొందుతున్నారని, రైల్వే కోడూరు ఆర్థిక వ్యవస్థ ఏపిఎండిసి పరిరక్షణకు లింకై ఉందని ప్రస్తుత విధానాల ఫలితంగా ఏపిఎండిసిలోని నిల్వలు వేగంగా అయిపోయే పరిస్థితి ఉందని, ఇదే కొనసాగితే దీనిని నమ్ముకుని జీవిస్తున్న వేలాది కుటుంబాలు తీవ్ర సంక్షోభంలోకి పోతాయని ఏఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
పరిశ్రమ మనుగడ రైల్వే కోడూరు భవిష్యత్తుకు ముడిపడి ఉన్నదని వివరించారు. ఈ సమస్యపై సిఐటియు ఆధ్వర్యంలో మిల్లు యజమానులతో కలిసి కార్మికులు, కార్మిక సంఘాలు పోరాడుతున్నాయని… సమస్య పరిష్కారానికి తోడ్పడకుండా అధికార పార్టీ నేతలు ఉద్యమాల్లో చురుగ్గా ఉన్న నేతలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని, సంబంధం లేకపోయినప్పటికీ … ఎప్పుడో జరిగిన కొన్ని ఘటనలను వాటికి కారకులుగా నేతలను చూపుతూ వారి కుటుంబాలను భయభ్రాంతులు కావడానికి పోలీసులు కారకులవుతున్నారని, అధికార పార్టీ నాయకులు అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులకు పోలీసు శాఖ నుంచి ఎటువంటి సహకారం అందించవద్దని, నిజాయితీ గలిగిన కార్మిక సంఘాల నేతల పట్ల అకారణంగా వేధింపులకు పాల్పడవద్దని కందారపు మురళి ఎఎస్పీ రవి మనోహరాచారికి సూచించారు. అందుకు
ఏఎస్పి రవి మనోహరచారి మాట్లాడుతూ సమస్యను ఎస్పీ సుబ్బరాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తోడ్పడుతామని, అక్రమ కేసులు, తప్పుడు వ్యవహారాలను తాము సహించబోమని కఠినంగా వ్యవహరిస్తామని సిఐటియు నేతలకు హామీ ఇచ్చారు.