
గంగ జాతరలో “కుప్పాల” ఫ్యామిలీ పూజలు
** దొర వేషంరోజున రూ.25వేలు విరాళం
తిరుపతి: నగరంలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న గంగ జాతర మహోత్సవాల్లో “కుప్పాల” ఫ్యామిలీ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. జాతర 5వ రోజున దొర వేషంతో భక్తులు వైభవంగా దర్శించుకున్నారు. ఈ వేషాన్ని కైకాల, చాకలి కులస్తులు అనువంశికంగా నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోంది. దొర వేషాన్ని కైకాల కులస్తులు, మంత్రి వేషాన్ని చాకలి కులస్తులు ధరించి సంప్రదాయబద్ధంగా జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేపట్టి, ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గంగమ్మ తల్లి జాతర సందర్భంగా చేపట్టిన ప్రత్యేక అభిషేకాలు, పూజల్లో బాలాజీ “రైల్వే డివిజన్ సాధన సమితి” కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు.
రూ.25వేలు విరాళం:
జాతర ఏర్పాట్ల కోసం గంగమ్మ గుడి చైర్మన్ నైనారు మహేష్ యాదవ్ కు రూ.25వేలు విరాళాన్ని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా 13వ తేదీన జాతరలో ముఖ్య ఘట్టమైన విశ్వరూప దర్శనం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ అమ్మవారి తీర్థప్రసాదాలను కుప్పాల గిరిధర్ కుమార్ దంపతులకు అందజేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, ఈఓ జయకుమార్ పాల్గొన్నారు.