
గంగజాతర నిర్వాహకులకు “రంగస్థలం” వారి సన్మానం
తిరుపతి: నగర ప్రజలకు గ్రామ దేవత అయిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరను ఈ ఏడాది అత్యంత అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించిన ఆలయ ఈవో జయకుమార్, ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్‌తో పాటు జాతర నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసి, పటిష్టమైన బందోబస్తు నడుమ తొమ్మిది రోజుల పాటు గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
జాతర విజయవంతానికి వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు, పోలీసు శాఖ, పారిశుధ్య సిబ్బంది అందించిన సహకారం ఎంతో కీలకమైందన్నారు. ముఖ్యంగా ఆలయ చైర్మన్, ఈవో, ఆలయ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. భక్తుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతంగా జాతర నిర్వహించిన ప్రతి ఒక్కరికీ మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గుండాల గోపినాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, రంగస్థలం సభ్యులు తొండము నాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కన్నప్ప కేశవులు తదితరులు పాల్గొన్నారు.