ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థికి చేరాలి…

TEJA NEWS

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థికి చేరాలి…

విద్యా ప్రమాణాల పెంపులో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి…

–కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి, ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి, అందిస్తున్న నాణ్యమైన విద్య ఫలాలు ప్రతి విద్యార్థికి చేరేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ వీక్ కార్యక్రమంపై సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్పంచులు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కొత్త తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సమస్యల పరిష్కారం, పాఠశాలల పెయింటింగ్ వంటి పనులు చేపట్టామని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలు ఉపయోగపడేలా మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, పనుల నాణ్యతను కాపాడేలా చూడాలని కోరారు.

మౌలిక వసతులతో పాటు విద్యా ప్రమాణాల పెంపుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాల్లో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
డ్రాప్ అవుట్లు, తరచూ గైర్హాజరు అయ్యే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించాలని, వారు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని అన్నారు.

ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత కోసం పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే తొలిసారిగా ఎఫ్ ఆర్ ఎస్ విధానాన్ని అమలు చేసిందని తెలిపారు. ఉపాధ్యాయుల బోధన తీరు, పిల్లలకు పాఠాలు అర్థమయ్యే విధానం వరకు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

ఇటీవల నిర్వహించిన సర్వేలో బోధన నాణ్యతలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రస్తుతం 60 శాతం మందికి మాత్రమే చేరుతోందని, ప్రజాప్రతినిధులు కూడా చురుకుగా భాగస్వామ్యం అయితే నాణ్యమైన విద్య ఫలాలు 100 శాతం ప్రజలకు చేరుతాయని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్, సెక్టోరియల్ ఆఫీసర్ మల్లేశం, జీసీడీఓ కవిత, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top