
28నుంచి నారాయణవనం బ్రహ్మోత్సవాలు
** ఆకాశరాజు నిర్మించిన కల్యాణ వెంకన్న పుణ్యక్షేత్రం
తిరుపతి / పుత్తూరు: శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రమైన నారాయణవనంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి జూన్ 5వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. 27న సాంప్రదాయబద్ధంగా అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఆకాశరాజు నిర్మించిన పుణ్యక్షేత్రం…
శ్రీ పద్మావతీ దేవి అవతరించిన పవిత్ర స్థలంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. శ్రీ ఆకాశరాజు పుత్రకామేష్టి యాగ సమయంలో స్వర్ణహలంతో భూమిని దున్నుతుండగా పద్మంపై వెలసిన దివ్య శిశువును కనుగొని “పద్మావతి” అని నామకరణం చేశారు. అనంతరం శ్రీనివాసుడు వేటకు విచ్చేసిన సందర్భంలో పద్మావతీదేవిని దర్శించి, ఆకాశరాజు అనుమతితో సకల దేవతల సమక్షంలో వివాహం జరిగింది. ఆ దివ్య కల్యాణ ఘట్టానికి చిరస్మరణగా ఆకాశరాజు నారాయణవనంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
స్వామివారి వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉండగా, ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి అమ్మవార్ల సన్నిధులు భక్తులకు దర్శనమిస్తాయి. అలాగే శ్రీ కోదండరామ స్వామి, శ్రీ రంగనాథ స్వామి, శ్రీ రాజమన్నార్ స్వామి ఉపాలయాలు ఈ క్షేత్ర మహిమను మరింత పెంచుతున్నాయి.
24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం…
బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయంలో ఈనెల 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర ద్రావణాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు.
బ్రహ్మోత్సవాల వాహనసేవలు:
ఈనెల 28న ఉదయం – ధ్వజారోహణం, రాత్రికి పెద్దశేష వాహనం, 29న ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రికి హంస వాహనం, 30న ఉదయం – సింహ వాహనం, రాత్రికి ముత్యపుపందిరి వాహనం,
31న ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం,
జూన్ 1న ఉదయం – మోహినీ అవతారం, రాత్రికి గరుడ వాహనం,
జూన్ 2నఉదయం – హనుమంత వాహనం, రాత్రికి గజ వాహనం,
జూన్ 3న ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనం,
జూన్ 4 న ఉదయం – రథోత్సవం, అశ్వవాహనం, కల్యాణోత్సవం,
జూన్ 5న ఉదయం – చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం.
కళ్యాణం….
జూన్ 4వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. రూ.1000/- టికెట్‌తో గృహస్తులు పాల్గొనవచ్చు. పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమను ప్రసాదంగా అందజేయనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ కోరింది.