వైభవోపేతం…ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం
** జ్యేష్ఠమాస పౌర్ణమికి భక్తజన సందడి
ఒంటిమిట్ట/తిరుపతి: తిరుమల – తిరుపతి దేవస్థానముల(టీటీడీ) అనుబంధ ఆలయమైన
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో జ్యేష్ట మాసం పౌర్ణమిని పురస్కరించుకొని
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి బంగారు ఆభరణాలు, వర్ణమైన పుష్పమాలలతో అలంకరించారు. ముందుగా అర్చకులు విశ్వక్సెన పూజ, కలశ ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహ వచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత పూజ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం పట్టు వస్త్ర సమర్పణ, కన్యాదానం, మాంగల్య పూజ, మాంగల్య ధారణ, అక్షతరూపణ మాల మార్పిడి, వారణమయి మహా నివేదనం, కర్పూర హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఒంటిమిట్ట సమీప ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించి తరించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
