ఎన్టీఆర్ ను తలపించేలా “ట్రస్ట్” సేవలు
** నారా భువనేశ్వరి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
తిరుపతి: స్వర్గీయ ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాలకు చేసిన అనితర సేవలను ఇప్పటి సమాజానికి తెలిపించేలా “ఎన్టీఆర్ ట్రస్ట్” సేవలు కొనసాగుతున్నాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మలు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి కచ్పపి ఆడిటోరియంలో శుక్రవారం భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, స్టేట్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలలో భాగంగా భారీ కేక్ ను కట్ చేసి భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సుమారు 300 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వక్తలు మాట్లాడుతూ…రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. రక్తదాతలను అతిధులు అభినందించారు. గత ఎన్నికల్లో నారా భువనేశ్వరి చంద్రబాబుతో సమానంగా రాష్ట్రంలో పర్యటించి మహిళలందరినీ చైతన్యపరిచి పార్టీ అధికారంలోకి రావడానికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు స్వయం ఉపాధి పొందడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి అనేక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నారా భువనేశ్వరి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
మహిళా శక్తి ఏంటో గత ఎన్నికల్లో నారా భువనేశ్వరి చూపించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో సమావేశాలను ఏర్పాటు చేసి వారిలో చైతన్యం నింపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేశారన్నారు. నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి భారీగా ప్రజలు తరలివచ్చి రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
నారా భువనేశ్వరి ఓవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఆమె జీవితం ఇప్పటి మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దంపూరు భాస్కర్ యాదవ్, డాక్టర్ సంజయ్, ఊట్ల సురేంద్ర నాయుడు, ఆముదాల తులసి, డిజిటల్ శ్రీనివాసులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
