టేకుమట్లలో హృదయ విదారక ఘటన

TEJA NEWS

టేకుమట్లలో హృదయ విదారక ఘటన

ప్రేమించి పెళ్లి చేసుకున్న పరిమళకు దారుణం

కట్నం వేధింపులతో యువతి మృతి

న్యాయం కోసం యువతి కుటుంబసభ్యుల ఆర్తనాదాలు

సూర్యాపేట జిల్లా : సూర్యాపేట మండలం, టేకుమట్ల గ్రామంలో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్న ఒక యువతి. కానీ ఆ ఆశలు అత్తింటి వేధింపుల అగ్నిలో కాలిపోయాయి. టేకుమట్ల గ్రామానికి చెందిన పరిమళ మృతి, కుటుంబాన్ని మాత్రమే కాదు సమాజాన్నే కలచివేస్తోంది. 2025 ఆగస్టు 7న అదే గ్రామానికి చెందిన పిండిగ అఖిల్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న పరిమళ, పెళ్లి తర్వాత ఆనందం కంటే అవమానాలే ఎక్కువగా ఎదుర్కొంది. చివరికి ఈ నెల 15న అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కట్నం పేరుతో నిరంతర వేధింపులు

నార్కట్‌పల్లి లోని Kamineni ఆసుపత్రిలో GNM నర్స్‌గా పనిచేస్తున్న పరిమళ నెలకు సుమారు రూ.20,000 సంపాదించేది. పగలంతా ఆసుపత్రిలో సేవ చేస్తూ అలసిపోయి ఇంటికి వస్తే, ఆ అమ్మాయి కి ఓదార్పు కాదు. అవమానమే ఎదురయ్యేది. కట్నం తేలేదని భర్త అఖిల్, అత్త, మామ కలిసి తరచూ ఆమెను వేధించేవారని, ఆమె జీతం అకౌంట్‌లో పడగానే భర్త తన ఖాతాకు బదిలీ చేసుకునేవాడని యువతి కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. రూ.1000 ఖర్చుల కోసం అడిగినా ‘చంపేస్తా’ అని భర్త బెదిరించేవాడని మృతురాలి అక్క మీడియా ఎదుట కన్నీటి పర్యంతమై తెలిపింది.

పోలీసులకు ఫిర్యాదులు… అయినా ఆగని హింస

తట్టుకోలేని పరిస్థితుల్లో పరిమళ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సఖీ సెంటర్‌లో కౌన్సిలింగ్ జరిగినా పరిస్థితి మారలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు “పరిమళ చనిపోయింది” అని పోలీసుల ద్వారా సమాచారం అందిందని తల్లిదండ్రులు తెలిపారు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో ఫ్రీజర్ బాక్స్‌లో తల వరకు మాత్రమే చూపించారని, హాస్పిటల్ కు“ఎవరు తీసుకొచ్చారు? ఏ డాక్టర్ నా కూతురు మరణం ధృవీకరించారు?” అనే ప్రశ్నలకు స్పష్టత రాలేదని ఆరోపిస్తున్నారు.

ఆమె సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు

నా చెల్లి సూసైడ్ చేసుకునేంత బలహీనురాలు కాదు. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించింది. మా కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదని మా నమ్మకం, అంటూ పరిమళ అక్క కన్నీరుమున్నీరైంది.

తల్లిదండ్రుల వేదన మరింత హృదయ విదారకం

మా అమ్మాయి ప్రేమించిన వ్యక్తి నమ్ముకుని పెళ్లి చేసుకుంది. అయినా ఆమెను సంతోషంగా చూడాలని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు ఆమె శవాన్ని మాత్రమే చూసే పరిస్థితి వచ్చింది. మా కూతురు తిరిగి రాదు… కానీ న్యాయం కావాలి,” అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

అరెస్టులు తక్కువ… న్యాయం ఎక్కడ?

ఈ కేసులో ఐదుగురిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇద్దరినే అరెస్ట్ చేశారని, మిగిలిన వారు బయటే ఉన్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక డీఎస్పీ విచారణ చేపట్టి “న్యాయం జరుగుతుంది” అని హామీ ఇచ్చినప్పటికీ, పూర్తి పారదర్శకతతో దర్యాప్తు జరగాలని స్థానిక గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబం, అవసరమైతే రీ-పోస్ట్‌మార్టమ్ లేదా సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతోంది.

సమాజాన్ని ప్రశ్నిస్తున్న ఘటన

ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎంచుకున్న ఒక యువతి… కట్నం పేరుతో అత్తింటి వేధింపుల నడుమ ప్రాణాలు కోల్పోవడం ఇది కేవలం ఒక కుటుంబం విషాదం కాదు, సమాజం ఆత్మపరిశీలన చేయాల్సిన సందర్భం. పరిమళకు న్యాయం ఎప్పుడు?
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సమాజం మేల్కొంటుందా? టేకుమట్లలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సమాధానం ఇంకా దొరకాల్సి ఉంది.

You cannot copy content of this page

Scroll to Top