స్విమ్స్ లో అతి త్వరలో ఏఐ వైద్య సేవలు
** రోబోటిక్ ఆపరేషన్లకు చర్యలన్న టీటీడీ చైర్మన్
తిరుపతి: తిరుపతిలో టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) మెడికల్ యూనివర్శిటీ పరిధిలో అతి త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని టీటీడీ చైర్మన్ కమ్ మెడికల్ యూనివర్శిటీ చాన్సలర్ బొల్లినేని రాజగోపాల్ (బిఆర్) నాయుడు చెప్పారు. స్విమ్స్ 13వ స్నాతకోత్సవాన్ని బుధవారం టి.టి.డి.కి చెందిన మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఛాన్సలర్ హోదాలో టీటీడీ చైర్మన్ నాయుడు అధ్యక్షత వహించగా….. ముఖ్య అతిథులుగా మధురై ఎయిమ్స్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సి.ఇ.ఓ. డాక్టర్ హనుమంతరావు, తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణ అధికారి(ఈఓ) జె.శ్యామల రావు, టీటీడీ పాలకమండలి సభ్యులు సుచిత్ర ఎల్లా, ఎన్.సదాశివరావు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తో పాటు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అకడమిక్ (గవర్నమెంట్ ఆఫ్ ఎ.పి) డాక్టర్ జి.రఘునందన్, స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్.బిట్లా, స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సర్జికల్ అంకాలజి విభాగాధిపతి డాక్టర్ హెచ్.నరేంద్ర, అనస్థీషియా డాక్టర్ జానకి సుభద్ర సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఛాన్సలర్ ఆఫ్ స్విమ్స్ యూనివర్శిటీ బి.ఆర్.నాయుడు పట్టాలను అందుకున్న విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. 1993 సంవత్సరం లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు దివ్య సంకల్పంతో మొదలైన శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) 30 ఏళ్లలో మహావృక్షమై రాయలసీమ ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఇప్పుడు రోజుకు 1500 మంది ఓపిడి విభాగానికి హాజరవుతున్నారని, 750 మంది ఇన్ పేషంట్స్ చికిత్సలు పొందుతున్నారన్నారు. అలాగే రోజుకు 30నుంచి 50 ఆపరేషన్లు ఇక్కడ జరుగుతున్నాయని, పబ్లిక్ రంగంలోనే మొత్తం భారతదేశంలో 2వ మహిళా వైద్య కళాశాలగా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఏర్పడి సాలీనా 175 మంది మహిళా వైద్యులను తయారు చేస్తున్నదన్నారు. స్విమ్స్ కు టీటీడీ నుంచి సాలీనా రూ.60 కోట్లు రెవిన్యూ గ్రాంటు అందిస్తుండగా… ప్రాణదాన ట్రస్టు క్రింద మరో 24 కోట్లు ఇస్తున్నామన్నారు.
వైద్య పరిశోధనల కోసం శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకం క్రింద నిధులు ఇవ్వబడుతున్నాయన్నారు. 2005 మంది విద్యార్థులకు ఉచిత భోజనం (సాలీనా రూ.5 కోట్లుతో) ఏర్పాటు చేశామని చెప్పారు. రూ.600 కోట్లతో కొత్త కట్టడాలు నిర్మితమతున్నాయని అందులో క్యాన్సర్ బ్లాక్, కార్డియో న్యూరో బ్లాక్, స్పెషాలిటీ బ్లాక్, సెంట్రల్ కిచెన్, సెంట్రల్ గోడౌన్, స్టాఫ్ క్వార్టర్స్, రోగుల కుటుంబీకులకు- చౌల్ట్రీ అందుబాటులోకి రానున్నాయన్నారు. స్విమ్స్ సర్వతోముఖాభివృద్ధికి మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి ఐ.వి. సుబ్బారావు కమిటీ సూచనల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో అదనంగా రూ.71కోట్ల నిధులు ఇస్తామన్నారు. ఎప్పటి కపుడు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుని మానవత్వంతో సమాజానికి వైద్యసేవలు అందించాలని సూచించారు. టీటీడీ ఈఓ
మాట్లాడుతూ*…1986లో ఏర్పాటైన శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ రాయలసీమకు శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదించిన వరమని, ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో దినదినాభివృద్ధి చెంది ఈ రోజు 13వ స్నాతకోత్సవాన్ని జరుపుకుంటుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, పీఆర్వో అధికారి రాజశేఖర్, సిబ్బంది అమర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, సుందర్, గణేష్, వైద్య విద్యార్థులు, విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
