డ్రగ్స్‌పై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
** ర్యాలీలో “శాప్” ఛైర్మన్ అనిమిని రవినాయుడు
విజయవాడ: మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించగలిగితేనే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యపడుతుందని, ఈ విషయంలో తమ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయం వద్ద అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవాన్ని “శాప్” ఛైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి అర్జున అవార్డు గ్రహీత, అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొని “సే నో… టూ డ్రగ్స్ – సే ఎస్… టూ స్పోర్ట్స్” అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తొలుత “శాప్” ఛైర్మన్ మాట్లాడుతూ డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్తు అంధకారమవుతుందని, వారి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని అన్నారు. డ్రగ్స్, గంజాయికి బానిసలవడం వల్ల వారి లక్ష్యాలను చేరుకోలేక పోతున్నారన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం పెనుభూతంగా పెరిగిపోయిందని, గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించిందని వివరించారు. ఈ మహమ్మారిని కూకటివేళ్లతో పెకలించాల్సిన సమయం ఆసన్నమైందని, అందరి భాగస్వామ్యంతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఎంతోమంది తల్లులు ఈ సమస్యను యువనేత నారా లోకేష్ దృష్టికి యువగళం పాదయాత్రలో తీసుకొచ్చారని, డ్రగ్స్‌ను నిర్మూలించాలని విన్నవించిన సందర్భాలు అనేకమున్నాయన్నారు. డ్రగ్స్ మత్తులో ఆడబిడ్డలపై అనేక అత్యాచారాలు జరుగుతున్నాయని, ఆడబిడ్డల జోలికొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు గంజాయి, మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపారని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో పనిచేస్తుందని వెల్లడించారు. ఆ దిశగా డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ టీమ్‌ను కూడా నియమించిందన్నారు. యువత మొత్తం క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే సామర్థ్యం క్రీడాకారులకు, సినీనటులకు మాత్రమే ఉందని, క్రీడాకారులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు స్పోర్ట్స్ అథారిటీ కూడా పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని వివరించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీఒక్క క్రీడాకారుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని మాట్లాడుతూ యువత భవిష్యత్తుతోపాటు సమాజం కూడా బాగుండాలంటే ప్రతీ ఒక్కరూ గంజాయి, మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలని కోరారు. వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు క్రీడలు దోహదపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో శాప్ పరిపాలనాధికారి ఎస్.వెంకటరమణ నాయక్, ఎన్టీఆర్ జిల్లా డీఎస్డీఓ అజీజ్, శాప్ కోచ్ కోటేశ్వరరావు, పెద్దఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు.
