వైరల్ వీడియోతో ప్రాణం పోయిన వ్యక్తి.. కేరళలో మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు

TEJA NEWS

వైరల్ వీడియోతో ప్రాణం పోయిన వ్యక్తి.. కేరళలో మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు

కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దీపక్ అనే వ్యక్తిపై ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆ వీడియో వైరల్ కావడంతో అవమాన భారాన్ని తట్టుకోలేక దీపక్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. కోజికోడ్‌లో బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో దీపక్ తనను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ మహిళ వీడియో రికార్డు చేసింది. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వేగంగా వైరల్ అయ్యింది. ఈ పరిణామాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన దీపక్, సమాజంలో తనపై వచ్చిన అపకీర్తిని తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, దీపక్ ఆత్మహత్యకు మహిళ చర్యలే కారణమని భావించి ఆమెపై కేసు నమోదు చేశారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్‌లో మహిళపై ఆత్మహత్యకు పురిగొల్పినట్లు (అబెట్‌మెంట్ ఆఫ్ సూసైడ్) ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ వీడియో వల్ల దీపక్ తీవ్ర అవమానానికి గురై మానసికంగా కుంగిపోయాడని ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు.

ఈ ఘటన సోషల్ మీడియా వినియోగంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఆరోపణలు చేసే ముందు, వీడియోలను బహిరంగంగా షేర్ చేసే ముందు పరిణామాలను ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, నిజానిజాలపై పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top