అర్జీదారుల సంతృప్తే పనితీరుకు గీటురాయి
- ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించాలి
- జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 133 అర్జీలు
- జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి, నిబద్ధతతో, నాణ్యతతో పరిష్కరించాలని.. అర్జీదారుల సంతృప్తే అధికారుల పనితీరుకు గీటురాయని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు.
కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్, శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో నాన్ రెవెన్యూ పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 62 రెవెన్యూ అర్జీలు, 71 రెవెన్యూ యేతర అర్జీలు కలిపి మొత్తం 133 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ యేతర అర్జీల్లో పురపాలక శాఖకు 18, పంచాయతీరాజ్ శాఖకు 16, పోలీసు శాఖకు 16, డీఆర్‌డీఏకు 4, పౌర సరఫరాల శాఖకు మూడు అర్జీలు వచ్చాయి. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రహదారులు-భవనాల శాఖలకు రెండు చొప్పున అర్జీలు రాగా డ్వామా, ఇరిగేషన్, విభిన్న ప్రతిభావంతులు, లేబర్, ఖజనా, పర్యాటకం, రవాణా శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయన్నారు.
వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టి క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో జాప్యానికి తావులేకుండా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, క్షేత్రస్థాయి అధికారుల సహకారంతో నిర్దేశ గడువులోగా అర్జీలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ సూచించారు.
నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
