యాదవ గొర్రెల కాపరులపై దాడి

TEJA NEWS

యాదవ గొర్రెల కాపరులపై దాడి

యాదవ సంఘాల ఆగ్రహం – న్యాయం కోసం గళమెత్తిన అగ్రనాయకత్వం

సూర్యాపేట జిల్లా ప్రతినిధి: అమాయక యాదవ గొర్రెల కాపరిపై జరిగిన దాడి ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ యాదవ హక్కుల పోరాట సమితి నాయకులు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మేకల రాముడు యాదవ్ మాట్లాడారు. మోతె మండలం రాఘవపురం గ్రామ శివారులో గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న లింగయ్యపై జరిగిన దాడి మానవత్వానికే మచ్చతెచ్చే ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 23న అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుతున్న సమయంలో దుశ్చర్ల సత్యనారాయణ గొడ్డలితో దాడి చేసి, అనంతరం కర్రతో కొట్టినట్లు ఆరోపించారు.

ప్రాణాలు కాపాడుకునేందుకు లింగయ్య చేసిన ప్రయత్నంలో జరిగిన పరిణామాల్లో సత్యనారాయణకు గాయాలు తగిలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని వివరించారు. అంతేకాకుండా, సత్యనారాయణపై గతంలో కూడా భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణ, గ్రామస్తులపై బెదిరింపులు, కుల దురహంకారంతో దూషణలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ముందుగా బాధితులతో కలిసి జిల్లా ఎస్పీ నరసింహను కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జటంగి వెంకట నరసయ్య యాదవ్, సామాజికవేత్త బోర సుభాష్ యాదవ్, కొండ శ్రీశైలం, మట్టిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు

You cannot copy content of this page

Scroll to Top