పసిపిల్లల గుండె జబ్బులపై అవగాహన

TEJA NEWS

పసిపిల్లల గుండె జబ్బులపై అవగాహన

** స్విమ్స్‌ డైరెక్టర్ డా. ఆర్‌.వి.కుమార్‌ హాజరు

తిరుపతి: భారతదేశంలో ప్రతి 1000 మంది చిన్నారులలో 8 మందికి పుట్టుకతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు వుంటాయని, అందులో 90శాతం మందికి ఆపరేషన్లు చేయాల్సిన అవసరం రావచ్చని, కావున ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన పెంచుకుని చిన్నపిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్విమ్స్‌ సంచాలకులు డా. ఆర్‌.వి.కుమార్‌ కోరారు.
నవంబర్‌ 14వ తేది బాలల దినోత్సవం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) సి.టి.సర్జరీ విభాగం ఆధ్వర్యంలో ‘‘పదిలం పదిలం పసిహృదయం’’ ‘చిన్న పిల్లల గుండె జబ్బులపై అవగాహన’’ పేరిట శ్రీ పద్మావతి హాస్పిటల్‌, ఓ.పి.డి. బ్లాక్‌ లో రెండు రోజుల పోస్టర్‌ ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రదర్శన వుంటుందని, ఆసుపత్రికి వచ్చే రోగులు, వైద్య విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించి అవగాహన పెంచుకోవాలని స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.రామ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌.వి. ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.వి.ఎస్‌.సత్యనారాయణ చేతుల మీదుగా పదిలం పదిలం పసిహృదయం అనే పుస్తకాలను వైద్య విద్యార్థులకు పంపిణీ చేశారు. స్విమ్స్‌ సంచాలకులు డా. ఆర్‌.వి.కుమార్‌, ఎస్‌.వి. ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.వి.ఎస్‌.సత్యనారాయణ , స్విమ్స్ వర్సిటీ డీన్‌ డా.అలోక్‌ సచన్‌, రిజిస్ట్రార్‌ డా. అపర్ణ ఆర్‌ బిట్లా, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.రామ్‌, మెడిసిన్‌ విభాగాధిపతి డా.అల్లాడి మోహన్‌, కార్డియాలజీ విభాగాధిపతి డా. రాజశేఖర్‌, సి.టి.సర్జరీ విభాగాధిపతి డా. సత్యవతి, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాధిపతి డా॥ కె.నాగరాజ్‌, జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్‌ శ్రీహరి రావు సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్‌ సంచాలకులు ఆర్‌.వి.కుమార్‌ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు అవసరాన్ని బట్టి 3 నుండి 4 ఆపరేషన్లు కూడా చేయాల్సి రావచ్చని, ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే మిగిలిన జీవితం మొత్తం సంతోషంగా గడపవచ్చునని సూచించారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులపై వైద్య సిబ్బందితో పాటు, నర్సులు, టెక్నీషియన్లు, మెడికో సోషల్‌ వర్కర్లు, సైకాలజిస్టులు, ఉపాధ్యాయులు అవగాహన పెంచుకొని, తెలియని వారికి తెలియజెప్పాలన్నారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు తమ తల్లిదండ్రులు సుశీలమ్మ, శ్రీనాధరావు పేరిట శ్రీనాధ సహృదయ సాహితి పేరిట సంస్థను స్థాపించి, పదిలం పదిలం పసిహృదయం అనే పుస్తకాన్ని ముద్రించినట్లు తెలిపారు. ఇందులో గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, ఎలా గుర్తుపట్టాలి, ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు తదితర అంశాలతో అందరికీి సులువుగా అర్థమయ్యేలా సరళమైన భాషలో సమగ్రమైన సమాచారం అందించినట్లు చెప్పారు. ఈ రోజు ఏర్పాటు చేసిన పోస్టర్‌ ప్రదర్శన ద్వారా గుండె పనితీరుపై అవగాహన పెంచుకుని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. శ్రీనాధ సహృదయ సాహితి సంస్థకు చెందిన ప్రొఫెసర్‌ ఆర్‌.వి.ఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పుస్తకం ద్వారా రెండు దశాబ్దాలుగా పలు ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి, ప్రజలకు చిన్న పిల్లల గుండె జబ్బులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. కరోనా సమయంలో స్విమ్స్‌ ఆసుపత్రి డాక్టర్లు విశేష సేవలందించి ఎంతో మందికి కొత్త జీవితాలను ప్రసాదించినట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సేవలను వినియోగించుకొని శ్రీ పద్మావతి వైద్య కళాశాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా దేశం నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోందని, వైద్య విద్యార్థులు కూడా ఆరిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతో నూతన వైద్య పరికరాలను రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా. రాధ, ఎస్‌.వి.మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. రవి ప్రభు, స్విమ్స్‌ ఆర్‌.ఎం.ఓ డా. వెంకట కోటిరెడ్డి, ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. కె.మాధవి, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. సుధారాణి, ఎం.ఆర్‌.ఓ. శిరీషా, ఎం.ఎస్‌.డబ్ల్యూ ప్రసాద్‌ రెడ్డి, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top