
మార్చి.24న.ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్బంగా అవగాహన ర్యాలీ…
పెద్దపల్లి// . ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని, (మార్చి 24) ఉదయం 9:30 గంటలకు జిల్లా ఆసుపత్రి, పెద్దపల్లి నుండి అమరచంద్ ఫంక్షన్ హాల్, పెద్దపల్లి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించబడుతుంది. అనంతరం అదే ఫంక్షన్ హాల్‌లో అవగాహన సమావేశం నిర్వహించబడుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు
క్షయ వ్యాధి (టి.బి) గురించి జిల్లా సమాచారం..
లక్ష్యం: 2026 సంవత్సరానికి టి.బి వ్యాధిని నిర్మూలించడం,టి.బి అనగా క్షయ వ్యాధి. ఇది మైకోబాక్టీరియం అనే సూక్ష్మ క్రిమి వలన వస్తుంది.
టి.బి ఎలా వ్యాపిస్తుంది…?
టి.బి వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు తుంపర్ల ద్వారా సమీపంలో ఉన్నవారికి వ్యాపిస్తుంది.
టి.బి లక్షణాలు:రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం రాత్రిపూట చెమటలు పడటం,
బరువు తగ్గడం.
టి.బి నిర్ధారణ:పై లక్షణాలు ఉన్నవారికి:
తెమడ పరీక్ష, ఛాతి ఎక్స్-రే చేయడం ద్వారా టి.బి నిర్ధారిస్తారు.
టి.బి రకాలు: సాధారణ టి.బి, ముదిరిన టి.బి 1) సాధారణ టి.బి:మొదటిసారి టి.బి నిర్ధారణ అయినవారికి 6 నెలల చికిత్స అందిస్తారు.
ఇంటెన్సివ్ ఫేజ్‌లో 2 నెలలు 4 రకాల మందులు కంటిన్యూయేషన్ ఫేజ్‌లో 4 నెలలు 3 రకాల మందులు,చికిత్స పూర్తయ్యాక పరీక్షలు చేసి వ్యాధి పూర్తిగా నయం అయినట్లు నిర్ధారిస్తారు.
2) ముదిరిన టి.బి: గతంలో చికిత్స పూర్తిగా తీసుకోని వారిలో క్రిమి మందులకు ప్రతిరోధకంగా మారుతుంది.
ఇలాంటి వారికి 1 నుండి 2 సంవత్సరాల పాటు 8 రకాల శక్తివంతమైన మందులతో చికిత్స అందించాలి.
నిక్షయ్ శివిర్ – 100 రోజుల కార్యక్రమం
(7 డిసెంబర్ 2025 నుండి 17 మార్చి 2026 వరకు) హైరిస్క్ జనాభా లక్ష్యం: 1,64,790 నిర్వహించిన టి.బి పరీక్షలు: 1,52,741 తెమడ పరీక్షలు: 22,364
ఎక్స్-రే పరీక్షలు: 1,52,741 నిర్ధారిత టి.బి కేసులు: 1,421 క్షయ వ్యాధిపై ప్రజల అవగాహన పెంచుకొని క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోరారు.