చెరువుల సుందరీకరణ వేగవంతం కావాలి
** “తుడ” అభివృద్ధి పనుల సమీక్షలో తిరుపతి కలెక్టర్
తిరుపతి: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో తుడా చైర్మన్ అండ్ టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్లతో కలిసి తుడా పరిధిలోని పలు కీలక అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా చెరువుల సుందరీకరణ, మాస్టర్ ప్లాన్ రోడ్లు, తుడా టవర్స్ నిర్మాణ పనులపై చర్చించి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చెరువుల సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అవిలాల చెరువు అభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిస్తూ, వేసవి కాలంలోపే పనులు ప్రారంభించాలని తుడా చైర్మన్, కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ: పేరూరు చెరువు నుండి అవిలాల చెరువు 5 కిలోమీటర్ల ఛానల్ అభివృద్ధికి,చెరువు బండ్ పనుల కోసం నిధులు కేటాయించడం జరిగిందన్నారు. 14 మీటర్ల వెడల్పుతో వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి స్పీడ్ బోట్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
శెట్టిపల్లి లేఅవుట్‌లో ఇంటర్నల్ రోడ్లు, వాటర్ ట్యాంకులు, ఎస్.టి.పి మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సమీక్షించారు. తుడా టవర్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా ప్లాస్టరింగ్, సబ్ స్టేషన్, సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ: మొదటి దశలో అవిలాల చెరువుతో పాటు కరకంబాడి మరియు శెట్టిపల్లి చెరువులను అభివృద్ధి చేయనున్నారు,ఓటేరు చెరువును తుడా ఆధ్వర్యంలో రక్షించాలని సూచించారు. వచ్చే మార్చి నాటికి వాణిజ్య సముదాయాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ఆదేశాలిచ్చారు. దీనికి సంబంధించి ఒక నెలలోపు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ అండ్ తుడా వైస్ చైర్మన్ ఆర్.గోవింద రావు మాట్లాడుతూ తిరుపతి నగరంలో వరద ముప్పును తగ్గించేందుకు ఇంటిగ్రేటెడ్ స్టార్మ్ వాటర్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అమలు చేయాలని, తద్వారా తుడా పరిధిలో వరద నియంత్రణ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి నీటి పారుదల శాఖతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని తుడా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, ఎస్ఈ రవీంద్రయ్య, చీఫ్ ప్లానింగ్ అధికారిని దేవికుమారి, భూసేకరణ అధికారిణి సుజన, తుడా అధికారులు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

