బాల్య వివాహ రహిత గ్రామంగా బ్రాహ్మణపల్లి…
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బ్రాహ్మణపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన బాలల పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి మర్రిపల్లి చందన హాజరయ్యారు.
ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ, బాలల హక్కుల పరిరక్షణలో కమిషన్ ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తుందని తెలిపారు. బాల కార్మికులు, పాఠశాల విడిచిపెట్టిన పిల్లలు (డ్రాప్అవుట్స్), చైల్డ్ ట్రాఫికింగ్ వంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్రాహ్మణపల్లి గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే, దేశంలోనే బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించబడిన తొలి గ్రామంగా బ్రాహ్మణపల్లి గుర్తింపు పొందే అవకాశముందని తెలిపారు. ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీ వేణుగోపాల్ రావు గారు,జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్, సభ్యులు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, సీడీపీఓ (పెద్దపల్లి, మంథని), అదనపు డి ఆర్ డి ఓ , ఎంపీడీఓ, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంఈఓ, హెచ్ఎం, గ్రామ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.
