బడ్జెట్ లో పరనిందే ఎక్కువగా ఉంది

TEJA NEWS

బడ్జెట్ లో పరనిందే ఎక్కువగా ఉంది

** ఉద్యోగ, కార్మికులకు మొండి చెయ్యి

** సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు

తిరుపతి: కూటమి ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్, గొప్పలు చెప్పుకోవడానికి, బడాయి మాటలు మాట్లాడుకోడానికి ఉద్దేశించినదిగా కనిపిస్తోందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి ఆరోపించారు. సాయంత్రం ఆయన సీఐటీయూ నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యంతో కలసి సీపీఎం ఆఫీస్ లో బడ్జెట్ పై మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర బడ్జెట్‌లో సోత్కర్ష (స్వప్రశంస), పరనింద (ఇతరుల నింద) మాత్రమే కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అప్పులు తెచ్చుకోవడానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచి చూపడం 2017 నుంచి రాష్ట్ర అధినేతలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. జంబోజెట్ బడ్జెట్‌లను ప్రవేశపెట్టి, ఆదాయం లేకపోవడంతో సవరించేటప్పుడు కేటాయింపులను తగ్గించుకోవడం గత కొంతకాలంగా రాష్ట్రంలో సాధారణ విధానంగా మారిందని కందారపు మురళి విమర్శించారు.


ఉద్యోగులకు 12వ పే రివిజన్ కమిషన్ ఇవ్వకపోవడం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం నిర్ణయించకపోవడం యజమానులకు అనుకూలమైన లేబర్ కోడ్‌లు, కార్మిక సంస్కరణల గురించి గొప్పగా చెప్పుకోవడం చేతగానితనమే అని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ కార్మికులు, ఉద్యోగుల హక్కులను పూర్తిగా విస్మరించిందని, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపలేదని ఆయన అన్నారు. నిరుద్యోగం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం, అమరావతి రాజధాని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులలో ప్రాధాన్యత క్రమం అధిక ధరలు తదితర మౌలిక అంశాలు ఈ బడ్జెట్లో కొరవడిందని కందారపు మురళి పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top