ఘనంగా దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి వేడుకలు
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు,ఐపీఎస్
భారతదేశం ప్రజాస్వామ్య చరిత్రలో అజరామరమైన స్థానాన్ని సంపాదించిన మహనీయుడు, సమానత్వ స్ఫూర్తికి ప్రతీక, ప్రజాసేవకు మారుపేరైన దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు,ఐపీఎస్ ఫిబ్రవరి 14న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు,ఐపీఎస్ దామోదరం సంజీవయ్య చిత్ర పటానికి పూలమాల వేసి,పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు,ఐపీఎస్ మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించి, తన ప్రతిభా సామర్థ్యాలతో ఉన్నత స్థానాలకు ఎదిగిన దామోదరం సంజీవయ్య, ప్రజాసేవకుడిగా అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అడ్డంకులు ఆయనను వెనక్కి నెట్టలేకపోయాయని, చదువు పట్ల ఆసక్తి, సామాజిక చైతన్యం పట్ల నిబద్ధత ఆయనలో చిన్న వయసులోనే పెంపొందాయన్నారు.
విద్యాభ్యాసంలో ప్రతిభ కనబరచి ఉన్నత విద్యను అభ్యసించి, విద్యే మార్పుకు మార్గమని నమ్మిన ఆయన, యువతకు చదువు ద్వారా ఎదగాలని ఎల్లప్పుడూ ప్రేరణనిచ్చేవారన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారని, నిష్కళంకత, నిజాయితీ, వినయం – ఇవే ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే లక్షణాలనిఅధికారం ఆయనను మార్చలేకపోయింది, ఆయన అధికారం ద్వారా సమాజాన్ని మార్చాలనే సంకల్పంతో పనిచేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజలతో అనుబంధాన్ని కొనసాగించడం ఆయన ప్రత్యేకతని, సమానత్వం, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ప్రజల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించడంలో ఆయన చూపిన నిబద్ధత, నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని జిల్లా ఎస్పీ తెలిపారు.
