
జనాభా లెక్కలు, స్వచ్చ సర్వేక్షణ్, ఓటరు జాబితా సవరణలను సకాలంలో పూర్తి చేయాలి….
–అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ…
పెద్దపల్లి//రామగుండం:
జనాభా లెక్కల స్వీయ గణన, స్వచ్చ సర్వేక్షణ్ పౌర స్పందన నమోదు, ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశించారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మెప్మా ఆర్‌పీలు ఇంటింటికి తిరుగుతూ ఈ మూడు కార్యక్రమాలను ఏకకాలంలో సమర్థవంతంగా పూర్తి చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
సిబ్బంది అందరూ స్వీయ గణన విధానం ద్వారా తమ జనాభా లెక్కల వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు ఇతరులను కూడా ప్రోత్సహించాలని తెలిపారు. రాబోయే స్వచ్చ సర్వేక్షణ్‌లో రామగుండం నగరం ఉత్తమ స్థానం సాధించేందుకు ఎక్కువ మంది పౌరులు ఆన్‌లైన్‌లో తమ అభిప్రాయాలను నమోదు చేసేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
అదేవిధంగా ఓటరు జాబితాలో మరణించిన వారు, శాశ్వతంగా మారిన వారి పేర్లను తొలగిస్తూ, అర్హులైన పౌరుల పేర్లు జాబితాలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలని, బూత్ లెవెల్ అధికారులుగా పని చేస్తున్న మెప్మా ఆర్‌పీలకు ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.