TEJA NEWS

చిల‌క‌లూరిపేట రైల్వేలైన్ అంశం అసెంబ్లీలో ప్ర‌స్తావిస్తా
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు
రైల్వేలైన్ సాధ‌న చిల‌క‌లూరిపేట ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ‌
చిల‌క‌లూరిపేట‌:
ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర కూట‌మి ప్ర‌భుత్వం పనిచేస్తోంద‌ని, ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చ‌డంలో ప్ర‌భుత్వం ముందంజ‌లో ఉంటుంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు చెప్పారు. శ‌నివారం రైల్వే సాధ‌న స‌మితి స‌భ్యులు ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావును ఆయ‌న నివాసంలో క‌ల‌సి రైల్వేలైన్ అంశాన్ని జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌స్తావించాల‌ని విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చిల‌క‌లూరిపేట‌కు రైల్వేలైన్ అత్య‌వ‌స‌ర‌మ‌ని, కూట‌మి ప్ర‌భుత్వం రైల్వేలైన్ అంశంపై కూడా సానుకూలంగా స్పందిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. గ‌తంలోనే తాను రైల్వే లైన్ ఏర్పాటు విష‌యంలో మ‌ద్ద‌తు తెలియ‌జేశాన‌ని గుర్తు చేశారు.

ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో అనేక ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు కానున్నాయ‌ని, ప‌ర్యాట‌క కేంద్రం కొండ‌వీడు మ‌రింతగా అభివృద్ది జ‌ర‌గ నుంద‌ని వెల్ల‌డించారు. విస్త‌రించే ప‌రిశ్ర‌మ‌ల‌కు, పెరిగే ప‌ర్యాట‌కుల‌కు రైల్వే లైన్ వ‌ల‌న ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని పేర్కొన్నారు. ఈ అంశాల‌ను అసెంబ్లీలో ప్ర‌స్తావించి, పేట ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ రైల్వే లైన్ ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తాన‌ని ప్ర‌త్తిపాటి హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా రైల్వే లైన్ సాధ‌న స‌మితి క‌న్వీన‌ర్ షేక్ సుభాని మాట్లాడుతూ చిల‌క‌లూరిపేట‌కు రైల్వేలైన్ ఏర్పాటు విష‌యంలో అన్ని రాజ‌కీయ పార్టీలు, స్వ‌చ్చంధ సంస్థ‌లు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు, పారిశ్రామిక‌వేత్త‌లు సైతం సంఘీభావం ప్ర‌క‌టించార‌ని వెల్ల‌డించారు. ఈ అంశంపై ముంద‌డుగు ప‌డాలంటే స‌మస్య‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లాల‌ని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూట‌మి ప్ర‌భుత్వం, కేంద్రంతో స‌త్సంబంధాలు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో రైల్వేలైన్ సాధ‌న విష‌యంలో ముంద‌డుగు ప‌ద‌నుంద‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాల్లూరి బాబురావు, సీపీఐ నాయకురాలు చేరుకుపల్లి నిర్మల, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆడపా మోహ‌న్ మాదిగ త‌దిత‌రులు పాల్గొన్నారు.