ఘనంగా నూతన సంవత్సరంలో తొలి గ్రామసభ నిర్వహణ
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట మండలం, టేకుమట్ల గ్రామంలో నూతన సంవత్సరానికి శుభారంభంగా తొలి గ్రామసభను ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన ఈ గ్రామసభ కావడంతో గ్రామంలో ప్రత్యేక ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సూర్యాపేట మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గ్రామసభను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. గ్రామస్థులు తమ సమస్యలను నేరుగా గ్రామసభ వేదికపై వెల్లడిస్తే, వాటిని త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ఉందని ఆయన సూచించారు. ఇదేవిషయమై గ్రామ సర్పంచ్ గట్టు జ్యోతి – శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య సేవలు వంటి అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న ప్రతి చిన్న సమస్యను కూడా తమ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ దుండిగ శివాజీ మాట్లాడుతూ గ్రామస్తుల ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. రోడ్లపై చెత్త వేయడం, పెంటగడ్డలు పోసి పరిసరాలను కలుషితం చేయడం వల్ల అనేక రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. అలాంటి పనులకు పాల్పడే వారిపై గ్రామపంచాయతీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అలాగే గ్రామపంచాయతీ రోడ్లపై గేదెలు, పశువులను ఉంచకూడదని కోరుతూ, శుభ్రమైన గ్రామంగా టేకుమట్లను తయారుచేయడానికి అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ గ్రామసభలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తాగునీటి సమస్యలు, రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, పాఠశాల వసతులు, వైద్య సేవలు వంటి అంశాలపై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులు సమస్యలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వెటర్నరీ డాక్టర్ బట్టు గోపి, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దైద పాపయ్య,
ప్రైమరీ స్కూల్ హెచ్ఎం నాగమణి,
గ్రామ కార్యదర్శి నరసింహరావు,
జీపీవో వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం పద్మ,వార్డు సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మల్టీ పర్పస్ వర్కర్లు,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
