సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కార్మికులను మోసం చేసే కుట్రలు..

TEJA NEWS

సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కార్మికులను మోసం చేసే కుట్రలు….

–గుర్తింపు సంఘాలపై విప్లవ సంఘాల తీవ్ర ఆరోపణలు….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని సింగరేణి ,
సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్మికులను మరోసారి మోసం చేసే కుట్రలో ప్రస్తుత గుర్తింపు సంఘాలు నిమగ్నమయ్యాయని విప్లవ సంఘాల నాయకులు తీవ్రంగా ఆరోపించారు. ఏఐటియుసి, ఐఎన్టియుసి సంఘాల నాయకులు కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కేవలం పైరవీలకే పరిమితమై కోట్లాది రూపాయలను లంచాల రూపంలో దుర్వినియోగం చేశారని విమర్శించారు.

గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి కార్మికులకు సంబంధించిన ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని, అదే డబ్బుతో మళ్లీ ఎన్నికల్లో గెలవాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో టీబీజీకేఎస్ కార్మిక వర్గానికి చేసిన నష్టాల మాదిరిగానే ప్రస్తుత సంఘాలు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.

సింగరేణిలో కార్మికుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నా, మెడికల్ ఇన్వాల్యుడేషన్ ప్రక్రియ నిలిచిపోయినా గుర్తింపు సంఘాల నాయకులు స్పందించడం లేదని విమర్శించారు. కారుణ్య నియామకాల విషయంలో కూడా స్పష్టత లేకపోయినా, కాంట్రాక్ట్ వేతనాలపై నియామకాలు చేపడతామని ప్రకటించినప్పటికీ ఈ సంఘాలు ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు.

జేబీసీసీఐ ఒప్పందాల పేరుతో పత్రికలు, టీవీల్లో ప్రచారాలు చేసుకోవడం తప్ప కార్మికులకు ఉపయోగపడే చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. కార్మిక వర్గం వీరి నిజస్వరూపాన్ని ఇప్పటికే గ్రహిస్తోందని తెలిపారు.
బెల్లంపల్లి ప్రాంతంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌జీకేఎస్ నాయకుడు అంబాల మహేందర్, ఏఐఎఫ్‌టీయూ నాయకుడు ఎం. పోచమల్లు, టీయూసీఐ నాయకుడు గోగర్ల శంకర్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొత్త గనులు ప్రారంభించడం, మెడికల్ ఇన్వాల్యుడేషన్ పునరుద్ధరించడం, పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్‌లకు ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో విప్లవ సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

You cannot copy content of this page

Scroll to Top